తిరుమలేశుడి సేవకు వినియోగించిన పుష్పాలు.. ఇకపై భక్తుల ఇళ్లల్లో వివిధ కళా రూపాల్లో దర్శనమివ్వనున్నాయి. స్వామి సేవలో వినియోగించిన పుష్పాలను శంఖుచక్రాలు, నామాలు, స్వామి, అమ్మవారి చిత్రపటాల రూపంలో భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తితిదే ప్రణాళికలు రూపొందించింది. ఇందుకు వైఎస్సార్ ఉద్యాన వర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్న తితిదే డ్రై ఫ్లవర్ సాంకేతికతతో వివిధ కళాకృతుల తయారీపై మహిళలకు శిక్షణ ఇస్తోంది.
తిరుమల శ్రీవారి కైంకర్యాలకు వినియోగించిన పూలతో ఇప్పటికే అగరబత్తీల తయారీ చేపట్టిన తితిదే.. ఇదే తరహాలో మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. డ్రై ఫ్లవర్ టెక్నాలజీని వినియోగించి స్వామి, అమ్మవార్ల చిత్రపటాలతో పాటు వివిధ రకాల కళాకృతుల రూపకల్పనకు సిద్ధమైంది. దేవస్థానం పరిధిలోని ఆలయాల్లో స్వామివారి సేవలకు వినియోగించిన పుష్పాలను తిరిగి వినియోగంలోకి తీసుకురావడానికి వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం సహకారంతో కార్యక్రమాలు చేపట్టింది. తిరుపతిలోని చీనీ, నిమ్మ పరిశోధన క్షేత్రంలో డ్రై ప్లవర్ సాంకేతికత ద్వారా కళాకృతుల తయారీపై మహిళలకు శిక్షణిస్తోంది.
ఎండుపూలతో అందమైన కళాకృతుల తయారీకి మహిళలకు మాత్రమే అవకాశం కల్పిస్తున్న తితిదే తొలి విడతలో 60 మంది వరకు తర్ఫీదు ఇస్తున్నారు. వివిధ సేవలకు వినియోగించిన పుష్పాలను...సిలికా జెల్, ఎంబెడెడ్, హాంగింగ్ విధానాలతో ఎండబెట్టి...అనేక కళాకృతులను తయారు చేసేలా మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. స్వామివారి సేవకు వినియోగించిన తొమ్మిది రకాల పుష్పాలను...కళాకృతుల తయారీకి వినియోగిస్తున్నారు.
ఇదీ చదవండి : మది దోస్తున్న తిరుగిరుల అందాలు