దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్) పరిధిలో వచ్చే ఏడాది నుంచి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయనున్నామని ఆ సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హెచ్. హరనాథ రావు వెల్లడించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వచ్చే రబీ సీజన్ నుంచి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పగటి పూట విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. తిరుపతిలోని సంస్థ కార్యాలయంలో ఐదు జిల్లాల సూపరింటెండింగ్ ఇంజినీర్లు, డివిజనల్ ఇంజినీర్లతో హరనాథ రావు శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
సంస్థ పరిధిలో అధిక లోడ్ ఉన్న ఫీడర్లలో సమస్యలు అధిగమించేందుకు చర్యలు తీసుకో వాలని హరనాథరావు సూచించారు. వ్యవసాయ విద్యుత్తుకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సంస్థ పరిధిలోని 5 జిల్లా కేంద్రాల్లో వేసవిలో పెరగనున్న విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని... అందుకు అనుగుణంగా 33కేవీ, 11కేవీ ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు.