బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఖాళీ అయిన తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగే ఉపఎన్నికకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను అధికార వైకాపా వేగవంతం చేసింది. వైకాపా అభ్యర్థిగా.. రాష్ట్ర వికలాంగుల సంక్షేమశాఖ ప్రత్యేకాధికారి, ఫిజియోథెరపిస్ట్ గురుమూర్తి పేరు దాదాపు ఖరారైంది. ఈయన పేరును నేడో రేపో అధికారికంగా ప్రకటించే అవకాశమున్నట్లు వైకాపా వర్గాలు తెలిపాయి. నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన వైకాపా నేత మేరిగ మురళీధర్ పేరూ చర్చకు వచ్చింది. తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోని ఐదుగురు ఎమ్మెల్యేలూ ఆయనకు మద్దతు తెలిపినట్లు, వారంతా ముఖ్యమంత్రి జగన్ వద్ద కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కర్నాటక కేడర్ సివిల్ సర్వీస్ అధికారిగా పనిచేస్తున్న నెల్లూరుకు చెందిన మరో వ్యక్తి కూడా తిరుపతి అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు కుటుంబీకులకే ఈ టికెట్ ఇవ్వాలని మొదట వైకాపా అధిష్ఠానం భావించినట్లు తెలుస్తోంది.
కానీ... ఇప్పుడు తిరుపతి టికెట్‌కు పోటీ తీవ్రంగా ఉంది. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికే అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో గురుమూర్తి పేరు పరిశీలనకు వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దుర్గాప్రసాద్ కుమారుడు కల్యాణ్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సీఎంతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్లు తెలిపిన కల్యాణ్ చక్రవర్తి.. లోక్‌సభ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా.. కుటుంబమంతా ప్రచారం చేస్తామని ప్రకటించారు.
తెలుగుదేశం కసరత్తు
తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలుగుదేశం.. గెలుపే లక్ష్యంగా కార్యచరణ ప్రారంభించింది. ఇప్పటికే పనబాక లక్ష్మిని తమ అభ్యర్థిగా ప్రకటించగా.. 97 మంది సీనియర్ నాయకులను నియోజకవర్గ ఇన్‌ఛార్జులుగా నియమించాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. శాసనసభ నియోజకవర్గాలు, మండలాలు, డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పగించారు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగే తొలి ఉపఎన్నిక కావడంతో.. అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల ముందుంచి గెలవాలనే ఎజెండాతో తెదేపా వ్యూహరచన చేస్తోంది. వైకాపా, జగన్ పతనం తిరుపతి నుంచే ప్రారంభం కావాలని పార్టీ నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శులు బీద రవిచంద్ర, నారా లోకేశ్ పర్యవేక్షణలో ఇన్‌ఛార్జులు బాధ్యతలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ స్థానం పరిధిలో మండల స్థాయిలో పార్టీ సంస్థాగత కమిటీలు, అనుబంధ కమిటీల నియామక ప్రక్రియను... ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశించారు.
ఏడాదిన్నర పాలనలో.. జిల్లాలో వైకాపా ప్రభుత్వ వైఫల్యాలనే ప్రచారాస్త్రాలుగా మలుచుకోవాలని తెదేపా భావిస్తోంది. తిరుమల ప్రతిష్ఠ దిగజార్చేలా ఎస్వీబీసీ ఛైర్మన్ వివాదం, భక్తులకు అశ్లీల వెబ్‌సైట్ల లింకులు పంపడం, అన్యమత ప్రచారం, పింక్ డైమండ్‌పై అసత్య ఆరోపణలు వంటి వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందించుకుంది. అలాగే తెదేపా హయాంలో తిరుపతిలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించనున్నారు. ఇప్పటివరకూ షెడ్యూల్ రాకపోయినా.. ఉప ఎన్నిక జరిగితే గెలుపు తమదే అన్న ధీమాతో అధికార, ప్రతిపక్షాలు ఉన్నాలు. భాజపా - జనసేన బరిలో దిగితే ఆ ప్రభావం ఎవరిపై ఎంతమేరకు ఉంటుందనే అంచనాలు జోరందుకున్నాయి.
ఇదీ చదవండి: