చిత్తూరు జిల్లాలో కొవిడ్ కేసులు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని.. తితిదే ఈవో, కొవిడ్ కమాండ్ కంట్రోల్ విభాగం ఛైర్మన్ జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో శనివారం జిల్లా కలెక్టర్ హరినారాయణ్, జాతీయ ఆరోగ్య మిషన్ అధికారులతో కొవిడ్ పరిస్థితులపై జవహర్ రెడ్డి సమీక్షించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ... కరోనా వ్యాధి ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా గ్రామాల్లోని కొవిడ్ బాధితులను హోం ఐసోలేషన్, కమ్యూనిటీ ఐసోలేషన్‌లో ఉంచేట్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ప్రజలకు కొవిడ్‌పై అవగాహన కల్పించేందుకు ఉదయం, సాయంత్రం దండోరా వేయించాలని చెప్పారు. తద్వారా ప్రజలు ఒక చోట నుంచి మరో చోటికి వెళ్లడం తగ్గి, కొవిడ్ వ్యాప్తిని అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు. సర్పంచులు వారి పరిధిలోని గ్రామాలను కొవిడ్ లేని ఊర్లుగా తీర్చిదిద్దేందుకు ప్రోత్సహించాలని సూచించారు.
కొవిడ్ లేని గ్రామాలుగా మార్చేందుకు కృషిచేసే సర్పంచులకు నగదు రివార్డులు ప్రకటించాలని కలెక్టర్‌కు జవహర్ రెడ్డి సూచించారు. గ్రామస్థాయిలో ప్రజలకు కొవిడ్ నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై పోస్టర్లు, కరపత్రాలు, లౌడ్ స్పీకర్లు విరివిగా ఏర్పాటు చేసి.. అవగాహన పెంచాలన్నారు. గ్రామస్థాయిలో ఉన్న సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు ఏర్పాటు చేసి.. వారి సేవలు పూర్తిగా వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
మాస్కు లేకుండా, భౌతికదూరం పాటించకుండా తిరిగే వారికి వాలంటీర్ల ద్వారా అవగాహన కల్పించాలని జవహర్ రెడ్డి సూచించారు. బ్లాక్ ఫంగస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు డిశ్చార్జ్ అయిన వెంటనే ఆ పరికరాలను మార్చి స్టెరిలైజ్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్విమ్స్ ఆసుప్రతిలో ఉన్న 20 టన్నుల అక్సిజన్ ట్యాంక్‌ను పూర్తిగా నింపి ఉంచాలన్నారు. ఆయుర్వేద ఆసుపత్రిలో అక్సిజన్ కొరత రాకుండా చూడాలని.. రద్దీ ప్రాంతాల్లో, ముఖ్యంగా హోటల్స్, ఇతర ప్రాంతాల్లో ఎక్కడ కూర్చుని తినే అవకాశం లేకుండా పార్శిల్‌లకు మాత్రమే అనుమతించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఇదీ చదవండీ... కొరత అంటూనే.. ప్రైవేటుకు టీకాలు ఎలా ఇస్తారు?: సీఎం జగన్