అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. దారి దోపిడీలకు పాల్పడే వారి నుంచి రూ.32 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. కేరళ రాష్ట్రానికి చెందిన కేవీ అశోకన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈ నెల 14న చిత్తూరు నగర శివారులోని చిత్తూరు - వేలూరు రోడ్డులోని గోపాలపురం వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. కేసుకు సంబంధం ఉన్న తొమ్మిది మందిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 3 కార్లు, 2 తుపాకులు, 2 లాఠీలు, తమిళనాడు పోలీసులకు చెందిన యూనిఫాం, 2 ఇనుప రాడ్లు, 9 సెల్ ఫోన్లు, రూ.32 లక్షల మేర దోపిడీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
అసలేమైందంటే..
కేవీ అశోకన్ అనే వ్యాపారవేత్తకు.. తమిళనాడు, కర్ణాటక, దుబాయ్, ఖతార్, బహ్రెయిన్ దేశాల్లో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. ఇతని స్నేహితుడు, ఫైనాన్షియర్ మొహమ్మద్‌కు కోయంబత్తూరుకు చెందిన షేక్ అబ్దుల్లా అనే వ్యక్తి.. సాయి కృష్ణ అనే మారు పేరుతో పరిచయం అయ్యాడు. తన వద్ద రెండు వేల నోట్ల రూపంలో బ్లాక్ మనీ ఎక్కువగా ఉందని.. వాటిని వైట్ గా మార్చుకోవాలని మొహమ్మద్‌కు తెలిపాడు.
రూ.90 లక్షల విలువైన రూ. 500 కరెన్సీ నోట్లుగా ఇస్తే.. తాను రూ. కోటి రెండు వేల విలువైన కరెన్సీ నోట్లు ఇస్తానని నమ్మబలికాడు. దానికి సహకరించేవారిని తనకు పరిచయం చేస్తే రెండు శాతం కమిషన్ సైతం చెల్లిస్తానని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన మొహమ్మద్.. మిత్రుడు కేవీ అశోకన్ కు విషయం తెలిపి అందుకు అవసరమైన రూ.90 లక్షల సొమ్మును రూ. 500 కరెన్సీ రూపంలో సిద్ధం చేసుకోవాలని సూచించాడు.
దీంతో... అశోకన్ రూ.45 లక్షల రూ. 500 కరెన్సీ నోట్లను సిద్దం చేసుకుని చిత్తూరు – వేలూరు రోడ్డులోని రిలయన్స్ పెట్రోల్ బంకు సమీపంలోకి చేరుకున్నాడు. దొంగల ముఠా సభ్యులైన నరేష్ కుమార్, అబీద్ బాషా, రమేష్ ప్రభాకర్, విజయ ఆనందన్, కుమార వడివేలు, మురుగా దాస్, రామ్ రాజ్, జయ పాల్ తదితరులు తమిళనాడు పోలీసు యూనిఫాం ధరించి.. అశోకన్, మొహమ్మద్‌పై దాడి చేసి.. వారి వద్ద నుంచి రూ.45 లక్షలను తీసుకుని పరారయ్యారు. ఈ ఘటనపై... వ్యాపారి అశోకన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసుకు సంబంధించి.. తమ దృష్టికి వచ్చిన ఇతర విషయాలపైనా ఆరా తీసేలా విచారణ చేస్తున్నారు.
ఇదీ చదవండి: