Padma Bhushan to Nandamuri Balakrishna: పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 139 మందికి పురస్కారాలు ప్రకటించిన కేంద్రం, వీరిలో ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. ఏపీ నుంచి కళల విభాగంలో నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ ప్రకటించారు.
తెలుగువాళ్లు ఎవరెవరికి అవార్డులు వచ్చాయంటే:
- కళల విభాగంలో నందమూరి బాలకృష్ణకు (ఏపీ) పద్మభూషణ్
- ఏపీకి చెందిన మిరియాల అప్పారావుకు పద్మశ్రీ (కళలు)
- ఏపీకి చెందిన కె.ఎల్.కృష్ణకు పద్మశ్రీ (సాహిత్యం)
- ఏపీకి చెందిన మాడుగుల నాగఫణిశర్మకు పద్మశ్రీ (కళలు)
- ఏపీకి చెందిన పంచముఖి రాఘవాచార్యకు పద్మశ్రీ (సాహిత్యం)
- తెలంగాణకు చెందిన దువ్వూరి నాగేశ్వర్‌రెడ్డికి పద్మ విభూషణ్ (వైద్యం)
- తెలంగాణకు చెందిన మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ (ప్రజావ్యవహారాలు)
నటసింహం నందమూరి బాలకృష్ణ: ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ రంగంలోకి వచ్చిన బాలకృష్ణ సినీ రంగానికి విశేష సేవలు అందిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ 1960 జూన్ 10న జన్మించారు. ఎన్టీఆర్, బసవరామతారకం దంపతుల ఆరో కుమారుడు బాలకృష్ణ. నటుడిగా, రాజకీయ నాయకుడిగానూ సేవలందిస్తున్నారు. తాతమ్మ కల (1974) చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. 14 ఏళ్ల వయస్సులోనే తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి నటించారు. 'సాహసమే జీవితం' చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. హిందూపురం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బసవతారకం ఆస్పత్రి ద్వారా క్యాన్సర్ రోగులకు చికిత్స అందిస్తున్నారు.
అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ గతేడాది ఆగస్టు 30వ తేదీతో సినీ ప్రయాణంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 1974 ఆగస్టు 30వ తేదీన ఆయన తొలి చిత్రం ‘తాతమ్మ కల’ విడుదలైంది. 50 ఏళ్ల సినీ ప్రయాణంలో నందమూరి బాలకృష్ణ 109 సినిమాల్లో కథానాయకుడిగా నటించారు. బాలకృష్ణ సరసన 129 మంది హీరోయిన్స్ ఆడిపాడారు. భారతీయ నటుల్లో అత్యధిక మంది హీరోయిన్స్‌తో కలిసి నటించిన రికార్డు బాలకృష్ణ పేరిట ఉంది.
సోషల్, మైథలాజికల్, బయోపిక్, సైన్స్ ఫిక్షన్, హిస్టారికల్ ఇలా అన్ని జానర్స్‌లలో నటించిన రికార్డు సైతం నటసింహం బాలయ్యకు ఉంది. విజయవంతమైన కథానాయకుడిగా ప్రయాణం కొనసాగిస్తున్న నటసింహం నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయ రంగంపైనా, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్‌గా సేవా రంగంపై కూడా తనదైన ముద్ర వేశారు.
భారత అథ్లెట్లకు పురస్కారాలు- శ్రీజేశ్కు పద్మ భూషణ్, అశ్విన్‌కు పద్మ శ్రీ