తిరుమలలో సోమవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు కుండపోత వర్షం కురిసింది. దీంతో శ్రీవారి దర్శనానంతరం బయటకు వచ్చిన భక్తులు తడిసి ముద్దయ్యారు. గదులకు చేరుకునేందుకు సైతం ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో రోడ్లపై నీళ్లు ప్రవహించాయి. గత నాలుగైదు రోజులుగా తిరుమలలో కురుస్తున్న వర్షాలతో జలాశయాల్లో నీటిమట్టం పెరుగుతోంది. తిరుమల ఘాట్‌రోడ్లలో వర్షం కారణంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఘాట్‌రోడ్డు సిబ్బంది చర్యలు చేపట్టారు.
కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు శేషాచలం కొండ ప్రాంతం నుంచి డ్యామ్‌లలోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రస్తుతం పాపవినాశనం డ్యామ్ నిండి నీటి మట్టం పెరుగుతుండటంతో సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4గంటల వరకు డ్యామ్ గేట్లు తెరిచి నీటిని కిందకు విడుదల చేసినట్టు తితిదే ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. డ్యామ్‌లోకి నీటి ప్రవాహం వర్షాలతో పెరుగుతుండటంతో ముందస్తు డ్యామ్ రక్షణ చర్యల్లో భాగంగా నీటిని కిందకు విడుదల చేసినట్టు చెప్పారు. గోగర్భం డ్యామ్‌లోనూ మరో ఒకటిన్నర అడుగులు నీళ్లు చేరితే డ్యామ్ గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తిరుమలలోని అన్ని డ్యామ్‌లలో దాదాపు 95శాతం వరకు నీరు నిల్వ ఉన్నట్టు అధికారులు తెలిపారు. గతేడాది కూడా ఇదే నెలకు డ్యామ్‌లన్నీ నిండి గేట్లు ఎత్తడం విశేషం. పాపవినాశనం డ్యామ్ గేట్లను తెరిచిన సమయంలో తితిదే ఉన్నతాధికారులు అక్కడికి చేరుకొని పరిశీలించినట్టు సమాచారం.
ఇదీ చదవండి:
RAINS IN ANDHRA PRADESH : భారీ వర్షాలు... లోతట్టు ప్రాంతాలు జలమయం