తిరుమలలో ఎడతెరపు లేని వర్షం కురిసింది. వర్షం ధాటికి తిరుమాడవీధులు, రహదారులు జలమయమయ్యాయి. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు, ఆలయానికి చేరుకునే వారు.. వానలో తడుస్తూ ఇబ్బందులు పడ్డారు. అలవీ ప్రాతంలో కురిసిన వర్షానికి జలాశయాల్లోకి భారీగా వరదనీరు చేరుతోంది.

కనుమదారిలో నేలకొరిగిన భారీ వృక్షం
ఈదుర గాలులతో కూడిన వర్షం కురుస్తుండడంతో మొదటి కనుమ దారిలోని 41వ మలుపు వద్ద భారీ వృక్షం నేలకొరిగింది. చెట్లు కూలిన సమయంలో అటుగా ఏ వాహనాలు రాకపోవటంతో.. పెద్ద ప్రమాదం తప్పింది. రహదాపై చెట్టు పడడంతో జీఎన్సీ ప్రాంతంలో వాహనాలను నిలిపివేశారు. దీంతో తిరుమల నుంచి తిరుగు పయనమైన భక్తులు ఇబ్బందులు పడ్డారు. అటవీ, ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది.. చెట్టును తొలగించే చర్యలు చేపట్టారు.

చిత్తూరులో
రుతుపవనాల ప్రభావంతో చిత్తూరు జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో.. తిరుపతి నగరంలోని వీధులు జలమయమయ్యాయి. గాంధీ రోడ్డు, తీర్దకట్ట వీధి, రెడ్డికాలనీలోని రహదారులపై వర్షపు నీరు నిలిచాయి. వెస్ట్ చర్చి, తూర్పు పోలీస్ స్టేషన్ రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

అన్నమయ్య కూడలి, టీవీఎస్ షోరూం కూడలిలో.. వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన నీటితో లక్ష్మీపురం కూడలిలో రహదారులన్నీ జలమయమయ్యాయి.
ఇదీ చదవండి:
Monsoon: రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు..పలు ప్రాంతాల్లో వర్షాలు