మారుతి జన్మస్థలంగా అంజనాద్రిని ప్రకటిస్తూ శ్రీరామ నవమి పర్వదినాని తితిదే ఏర్పాటు చేసిన పండిత కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని విబేధిస్తూ... హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ఫౌండర్ ట్రస్టీ గోవిందానంద సరస్వతి జరిపిన సంవాదం అసంపూర్తిగా ముగిసింది. తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వేదికగా... సుమారు నాలుగున్నర గంటల పాటు జరిగిన భేటీలో తితిదే పండిత కమిటీ తరపున సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి మురళీధరశర్మ, ఎస్వీ వేదవిశ్వవిద్యాలయం వీసీ సన్నిధానం సుదర్శన శర్మ, తితిదే వేదాధ్యయన సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు. పంపాక్షేత్ర కిష్కింధ సామ్రాజ్యం తరపున హంపిలోని హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఫౌండర్ ట్రస్టీ గోవిందానంద సరస్వతి పాల్గొన్నారు.
ఇరు వర్గాల మధ్య సుదీర్ఘంగా సాగిన సంవాదం చివరకు అసంపూర్తిగా ముగిసినట్లు గోవిందానంద సరస్వతి తెలిపారు. తితిదే పండిత కమిటీ ఇతరులు చెప్పింది వినే స్థితిలో లేదన్న గోవిందానంద సరస్వతి....అసలు ఆ కమిటీకి ఉన్న ప్రామాణికతను ప్రశ్నించారు. తిరుమత తిరుపతి దేవస్థానాల పరిధిలో దైవిక నిర్ణయాలు... తిరుమల పెద్దజీయర్ స్వాముల నిర్ణయంతోనే జరగాలన్న గోవిందానంద... ఇలాంటి పెద్ద నిర్ణయం తీసుకునేప్పుడు ఆయన ఎందుకు కమిటీలో లేరని ప్రశ్నించారు. కంచి కామకోటి పీఠం, శృంగేరీ పీఠం, మధ్వాచార్యుల పరంపర ఇంత మంది ఉండగా తితిదే పండిత కమిటీ సంక్లిష్ట నిర్ణయాలు ఎందుకు తీసుకుందో అర్థం కావటం లేదన్నారు.
పురాణాల ఆధారంగా చెప్పామని తితిదే చెబుతున్నా... యుగాలు, మన్వంతరాలు గడిచిపోయిన తర్వాత పేర్లలో మార్పులు ఉండటం సహజమన్నారు గోవిందానంద. విజయవాడలో అయోధ్యనగర్ ఉందని.....దానిని శ్రీరాముడి అయోధ్య అనలేమని ఉటంకించిన గోవిందానంద సరస్వతి....రామాయణం ప్రామాణికంగా కిష్కింధే హనుమంతుడి జన్మస్థలమని తేల్చిచెప్పారు. పండిత కమిటీ పరిశోధన సమయంలో కిష్కింధకు ఎందుకు రాలేదని ప్రశ్నించిన గోవిందానంద.....కేవలం అధికారులు తీసుకున్న నిర్ణయంగానే దీన్ని భావిస్తామన్నారు.
తితిదే ప్రకటనపై స్పందించాల్సిందిగా శృంగేరీ, కంచి కామకోటి పీఠం, మధ్వాచార్యులు, తిరుమల జీయర్ స్వాములను కలవనున్నట్లు గోవిందానంద తెలిపారు. ప్రస్తుతం సమస్య వచ్చినప్పుటికీ తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రమన్న గోవిందానంద సరస్వతి.... అనవసర వ్యాఖ్యానాలు తిరుమలపై చేస్తే మేమే ఊరుకోబోమని హెచ్చరించారు. తితిదే అధికారులు తీసుకున్న అభిప్రాయంగానే భావిస్తాం కానీ... జీయర్ స్వాములకు దీనితో సంబంధం లేదనే అనుకుంటున్నామన్నారు. సామాన్య జనాలను గందరగోళంలోకి నెట్టేలా తితిదే వాదనలు ఉన్నాయన్న గోవిందానంద సరస్వతి... ఆంజనేయుడి జన్మతిథి అంటూ మూడు తిథులను తితిదే చెప్పటాన్ని తోసిపుచ్చారు.
ప్రస్తుతం క్షీర సాగర మథనం జరుగుతోందన్న గోవిందానంద సరస్వతి....ఇప్పుడు హాలాహలం వచ్చినా తర్వాత అమృతం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండీ... ఆనందయ్య మందుపై ఎవరు అనుమతివ్వాలో కేంద్రం తెలపాలి: హైకోర్టు