వేంకటేశ్వరుడు వెలసిన స్వర్గధామం తిరుమల పుణ్యక్షేత్రం. నిత్య కల్యాణం పచ్చతోరణంలా అనుక్షణం శోభిల్లే తిరుగిరులు.. బ్రహ్మోత్సవాల వేళ భక్త కోటితో పోటెత్తుతున్నాయి. నిత్య కైంకర్యాలతో కొలువు తీరే కోనేటి రాయుడు.... పూటకో వాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు చెంతకే వచ్చి అభయప్రదానం చేస్తున్నారు. ఇలాంటి వైభవాన్ని తనివితీరా వీక్షిస్తున్న భక్తులను సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. గోవింద నామ స్మరణ చేస్తూ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 625 కళాబృందాలు ఏకమై కాలు కదుపుతుంటే అల వైకుంఠపురమే దిగి వచ్చిందా అనేంతలా స్వామి వారి ఉత్సవాలు హోరెత్తిస్తున్నాయి.
ఉత్తర భారత కళాకారులకు ఆహ్వానం
గత ఏడాది రెండు సార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. కాగా వార్షిక బ్రహ్మోత్సవంలో కేవలం ఆరు రాష్ట్రాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో కేవలం ఏడు రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారుల బృందాలు మాత్రమే పాలు పంచుకున్నాయి. కానీ వేంకటేశుని వైభవాన్ని దశదిశలా చాటేలా తితిదే ఈ సారి బ్రహ్మోత్సవాల్లో ప్రణాళికలు రచించింది. అందులో భాగంగా దక్షిణ భారతదేశ రాష్ట్రాలతో పాటు తొలిసారిగా ఉత్తర భారతదేశం, ఈశాన్య రాష్ట్రాల నుంచి సైతం కళాకారుల బృందాలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానం పలికింది. ఒక్కో రాష్ట్రం నుంచి కనీసం 7 బృందాల చొప్పున ఏకంగా 625 కళాబృందాలు, భజన బృందాలు ఈసారి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాల్లో భాగస్వామ్యమయ్యాయి. పూటకో వాహనంపై శ్రీవారు కొలువుతీరి విహరిస్తుంటే ఆ మాడవీధుల్లో స్వామి వాహనం ముంగిట ఈ కళా బృందాలు చేస్తున్న విన్యాసాలు భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తున్నాయి.
విశేష స్పందన
స్వామి వారి వాహన సేవకు వచ్చే ప్రతి భక్తుడు గ్యాలరీల్లో వేచిచూడకుండా ఆ సమయాన్ని దేశ సంస్కృతీ సంప్రదాయాలను తిలకించే విధంగా పావులు కదిపింది. అనుకున్న దానికంటే ఎక్కువగా ఈ సారి సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.