తిరుపతి పద్మావతి అతిథి గృహంలో సీఎస్ మీడియా సమావేశం నిర్వహించారు. తితిదేలోని తాళపత్ర గ్రంథాల పరిరక్షణ, పునఃముద్రణపై చర్చించినట్లు తెలిపారు. తితిదే మ్యూజియంను అభివృద్ధి చేస్తామని అన్నారు. తిరుమలలో అన్యమత ప్రచారంపై స్పందించిన ఆయన... బస్సు టికెట్ల వెనుక అన్యమత ప్రచారం ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం తెలిపారు. నివేదిక ఇవ్వాలని ఇప్పటికే ఆర్టీసీ ఎండీని ఆదేశించామని వెల్లడించారు. తిరుమల పవిత్రత కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. ఆలయాల్లో అన్యమత ప్రచారం ఆరికట్టేందుకు సమన్వయ కమిటీ ఏర్పాటుకు యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎం జగన్ తో చర్చించాక దీనిపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
అవసరమైతే తనిఖీలు
హిందూ ఆలయాల్లో పనిచేసే వాళ్లు కచ్చితంగా హైందవధర్మం పాటించాలని సీఎస్ తెలిపారు. అవసరమైనతే దేవదాయ సిబ్బంది ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు చేస్తామని స్పష్టం చేశారు.