తిరుపతిలో నిర్వహించిన జగనన్న విద్యాదీవెన బహిరంగ సభ పద్మవ్యూహాన్ని తలపించింది. ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్న ఈ సభకు భారీగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తరలించారు. అలాగే మహిళా సంఘాల సభ్యులనూ తీసుకొచ్చారు. సభ పూర్తయ్యే వరకూ ఎవరూ బయటికి వెళ్లకుండా.. పోలీసులు, మెప్మా అధికారులు సభ నిర్వహించిన గ్రౌండ్ గేట్లన్నీ మూసివేశారు. అయితే 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్న వేళ.. సభా ప్రాంగణంలో తీవ్రమైన ఉక్కపోతను విద్యార్థులు, తల్లిదండ్రులు, మహిళా సంఘాల సభ్యులు భరించలేకపోయారు.
ఎండ తీవ్రతను తట్టుకోలేకపోతున్నామని, నీరసం వస్తున్నందున బయటికి పంపాలని ప్రాథేయపడినా పోలీసులు, మెప్మా అధికారులు లెక్కచేయలేదు. వారిని బెదిరించి గేట్ల వద్దే నిలువరించారు. దీంతో.. ఓపిక నశించిన మహిళా సంఘాల సభ్యులు... పోలీసుల తీరుపై మండిపడ్డారు. గేట్లు తోసుకుని బయటికి వెళ్ళిపోయారు. విద్యార్థులైతే పది అడుగుల ప్రహరీ పైకి ఎక్కి అవతలకు దూకేశారు. అలా వెళ్లలేకపోయిన కొందరు మహిళలు నీరసంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ పరిస్థితుల్లో చేసేదేమీ లేక ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న సమయంలోనే అధికారులు గేట్లు తెరిచారు. అప్పటిదాకా ఉక్కపోతతో అల్లాడిపోయిన మహిళలు..గేట్లు తీశాక అక్కడి నుంచి బయటపడ్డారు.
ఇదీ చదవండి: ఆ పాఠశాలల నుంచే.. పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీక్: సీఎం జగన్