Chandrababu on YCP Parthasaradhi death: చిత్తూరు జిల్లా కుప్పం గంగమ్మ ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్ పార్థసారథి ఆత్మహత్యపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. పార్థసారథి ఆత్మహత్య, కుప్పంలో జరుగుతున్న ఆందోళనలపై పార్టీ నేతలతో ఆరా తీశారు. సొంత పార్టీ వైకాపా నాయకుల కారణంగానే పార్థసారథి ఆత్మహత్య చేసుకున్నట్లు.. తెలుగుదేశం స్థానిక నేతలు చంద్రబాబుకు వివరించారు. వైకాపా నేతల వేధింపులకు చివరికి సొంత పార్టీ వ్యక్తులు కూడా బలవుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు.
డబ్బులకు పదవులనే విష సంస్కృతిని వైకాపా నేతలు కుప్పంలోకి కూడా తీసుకువచ్చారని మండిపడ్డారు. గంగమ్మ గుడి ఛైర్మన్‌గా పనిచేసిన బలహీనవర్గానికి చెందిన పార్థసారథి.. సొంత పార్టీలో అవమానాలు తట్టుకోలేక ప్రాణాలు తీసుకోవడం విచారకరమన్నారు. పార్థసారథి ప్రాణాలు పోవడానికి కారణమైన వారిపై కేసు నమోదు చేయాలని, ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పార్థసారథి కుటుంబానికి చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
MP Reddappa was deposed by Valmiki community leaders: కుప్పంలో వైకాపా ఎంపీ రెడ్డప్పను వాల్మీకి సంఘం నాయకులు నిలదీశారు. రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయం పాలకవర్గం మాజీ ఛైర్మన్, వైకాపా నేత పార్థసారథి మృతదేహానికి నివాళులు అర్పించడానికి రెడ్డప్ప వెళ్లారు. రెడ్డప్పతోపాటు ఆయన వెంట ఎం.ఎల్.సి భరత్ సైతం ఉన్నారు. కాగా.. వీరిని పార్థసారథి కుటుంబ సభ్యులు, బంధువులు, వాల్మీకి సంఘం నాయకులు ఘెరావ్ చేశారు. ఛైర్మన్ పదవి కోసం డబ్బులు తీసుకుని, ఇటీవల పదవి నుంచి తప్పించడంతో పార్థసారథి ఆత్మహత్య చేసుకున్నారంటూ నేతలను గట్టిగా నిలదీశారు. పార్థసారథి చనిపోవడానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : నాపై చంద్రబాబు బురద : జగన్