ప్రభుత్వం పంపిణీ చేసే నెలవారీ పింఛన్(pension) తీసుకునేందుకు అంధ విద్యార్థులు(Blind students) అగచాట్లు పడుతున్నారు. అనంతపురం జిల్లా పరిగి మండలం కొడిగెనహళ్లిలో ఉన్న అంధ ఆశ్రమ పాఠశాలలో కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి 53 మంది విద్యార్థులు చదువుతున్నారు. గతంలో వీరంతా పింఛన్ తీసుకునేందుకు మూడు నెలలకు ఒకసారి స్వగ్రామానికి వెళ్లేవారు. కానీ ప్రభుత్వం పింఛన్ విషయంలో కొత్త నిబంధనలు(New rules in pensions) పెట్టింది. పింఛన్ దారులు ప్రతి నెలా బయోమెట్రిక్ ఆధారంగా చిరునామా వద్దే పింఛన్ తీసుకోవాలని... లేని పక్షంలో ఆ నెల పింఛన్ ఇవ్వమని ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త విధానాలు లబ్ధిదారులకు కష్టాలు తెచ్చి పెట్టాయి.
పింఛన్ వదులుకోలేక... చదువులు మానుకొని సొంతూళ్లకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. మరోవైపు వారి తల్లిదండ్రులు కూడా మూడు రోజులపాటు పనులు మానుకొని... పిల్లలను వెంట తీసుకెళ్తున్నారు. దీని వల్ల చదువుపై ప్రభావం పడుతుందని... అదే విధంగా అమ్మ ఒడి పథకానికి కూడా అర్హత కోల్పోతామని విద్యార్థులు వాపోతున్నారు. ఎందుకంటే 75 శాతం హాజరు లేనిపక్షంలో అమ్మఒడి పథకానికి అనర్హులుగా ప్రకటిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి నెలా పింఛన్‌కు వెళ్లి వచ్చే క్రమంలో హాజరు శాతం 75 శాతానికి లోబడి వస్తుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమ సమస్యను గుర్తించి పాఠశాల వద్దే పింఛన్ తీసుకునేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ప్రతి నెల మేము పింఛన్ తీసుకోవటానికి వెళ్లటంతో రెండు మూడు రోజులు తరగతులకు హాజరుకాలేకపోతున్నాం. తిరిగి వచ్చి చదువుకోవటాని ఇబ్బందిగా ఉంది. దయచేసి ఇక్కడే మేము పింఛన్ తీసుకునే సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. -భాను లక్ష్మి, పదవ తరగతి విద్యార్థిని
ప్రస్తుతం మా పాఠశాలలో 53 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల పిల్లలు ఇక్కడ ఉన్నారు. ప్రతి నెల పింఛన్ కోసం తల్లిదండ్రుల వచ్చి తీసుకెళ్తున్నారు. దాని వల్ల పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు. దానితోపాటు అమ్మఒడి పథకానికి కూడా అర్హత కోల్పోతున్నారు. ఎందుకంటే 75 శాతం హాజరు నమోదు కావటం లేదు. -కరీం, అంధుల ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు
ఇదీ చదవండి