స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు భాజపా- జనసేన పార్టీలు క్షేత్రస్థాయిలో సమయాతమవుతున్నాయి. వివిధ జిల్లాల్లో ఇరు పార్టీల నేతలు కలిసి సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. చిత్తూరు జిల్లాకు సంబంధించిన భాజపా రాష్ట్ర కార్యదర్శులు భానుప్రకాష్ రెడ్డి, కోలా ఆనంద్. జనసేన పార్టీ రాష్ట్ర సమన్వయకర్త పసుపులేటి హరిప్రసాద్ తదితరులు జిల్లాల్లోని పార్టీ కార్యకర్తలు, నేతలతో తిరుపతిలో భేటీ అయ్యారు. స్థానిక ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయాలనే అంశంపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొని ఉందని అభిప్రాయపడిన నేతలు...స్థానిక పోరులో సత్తా చాటాలని ధీమా వ్యక్తం వ్యక్తం చేశారు. సమన్వయంతో పని చేసి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.
మెజార్టీ స్థానాలను గెలవాలి:జనసేన
స్థానికి సంస్థల ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని ఆ పార్టీ ఉభయగోదావరి జిల్లాల కన్వీనర్ మేడ గురుదత్త ప్రసాద్ పిలుపునిచ్చారు. పి గన్నవరంలో నిర్వహించిన జనసేన పార్టీ ఎన్నికల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జనసేన- భాజపా పొత్తుల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు సర్దుబాటు చేసుకోవాలని ఆయన సూచించారు.