తిరుమల తిరుపతి దేవస్థానం పూజా కార్యక్రమాల నిర్వహణ సమయంలో నిబంధనలు పాటించడంలేదని దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఆగమశాస్త్ర నిబంధనలు పాటించేలా, హిందూయేతరుల నుంచి డిక్లరేషన్ తీసుకునేలా తితిదే కార్యనిర్వహణ అధికారిని ఆదేశించాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీవారి దాదా హైకోర్టులో పిల్ వేశారు. తితిదే ఆగమశాస్త్రానికి విరుద్ధంగా స్వామివారికి వివిధ సేవలు నిర్వహిస్తోందని పిటిషనర్ న్యాయవాది నాగేంద్రరెడ్డి వాదనలు వినిపించారు. నిబంధనలు పాటించడంలేదని ఏడాది మార్చి 18న తితిదే ఈవోకు పిటిషనర్ వినతిపత్రం సమర్పించారన్నారు. అయినా తప్పుల్ని సరిదిద్దుకోలేదని కోర్టుకు తెలిపారు.
మార్గదర్శకాలు ఉన్నాయా?
ధర్మాసనం స్పందిస్తూ.. పూజా కార్యక్రమాలను ఫలానా పద్ధతిలో నిర్వహించాలని కోర్టు ఎలా ఆదేశిస్తుందని ప్రశ్నించింది. ఈ విషయంలో హైకోర్టు ఏవిధంగా జోక్యం చేసుకుంటుందని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో ప్రజాహితం ముడిపడి ఉన్నందున కోర్టు జోక్యం చేసుకోవచ్చని న్యాయవాది కోరారు. ఆగమశాస్త్ర నిబంధనలను తితిదే అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు మార్గదర్శకాలు ఉన్నాయా? అని ధర్మాసనం అడిగిన ప్రశ్నకు న్యాయవాది అవునని బదులిచ్చారు. ఆ నిబంధనలేమిటో చూపాలని ధర్మాసనం ప్రశ్నించింది. సంబంధిత పుస్తకాలు తితిదే వద్ద ఉంటాయని, వాటిని కోర్టుకు సమర్పించేలా నోటీసులు జారీచేయాలని న్యాయవాది అభ్యర్థించారు. ఏ విషయంలో ఉల్లంఘనలకు పాల్పడ్డారు అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోర్టు పిటిషనర్ ప్రశ్నించింది. సంబంధిత వివరాలు లేకుండా పిల్ దాఖలు చేస్తే తితిదేను కోర్టు ఏవిధంగా కోరుతుందని వ్యాఖ్యానించింది. న్యాయవాది స్పందిస్తూ .. సంబంధిత దస్త్రాలను కోర్టులో దాఖలు చేసేందుకు కొంత సమయం కావాలని అభ్యర్థించారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను అక్టోబర్ 16కు వాయిదా వేసింది. పిటిషన్ ప్రతులను తితిదే తరఫు న్యాయవాదికి అందజేయాలని పిటిషనర్ తరపు న్యాయవాదికి సూచించింది.
ఇదీ చదవండి : 'లైసెన్స్ పొందకుండా ఏపీఎండీసీ ఇసుక సరఫరా చేస్తోంది'