TDP district committee meeting : తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరంలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో.. పోలవరం ప్రాజెక్ట్ స్థితిగతులు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి చర్చించారు. ఈ అంశాలపై నివేదిక తయారు చేసి అధిష్టానానికి పంపించాలని తీర్మానించారు. రాష్ట్రానికి రాజధాని అమరావతినే కాదు రాష్ట్రాన్నే శ్మశానంగా మార్చారని నెహ్రూ వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డారు. విభజన ద్వారా అభివృద్ధని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ మూడేళ్ల కాలంలో ఏ ప్రాజెక్ట్ ను పూర్తి చేయలేదని.. కొత్త పరిశ్రమలు తీసుకురాలేదని.. రాష్ట్రాన్ని విభజించి మాత్రం ఏం చేస్తారని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.
ఈ సమావేశంలో ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. 18 విభాగాలకు చెందిన 350 మందితో మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం ప్రమాణ స్వీకారం చేయించారు.అనంతరం జాతీయ రహదారి 216 పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్,బాలయోగి విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు తెదేపా నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి : LOKESH:'అయ్యన్నపాత్రుడుపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి'