మీరు హోటల్‌కు వెళితే ఏం కావాలంటూ సర్వర్లు వస్తారు. ఏం కావాలో చెప్పగానే వివరాలు తీసుకెళ్లి ఆర్డర్ చేసిన ఆహార పదార్థాలు తీసుకొస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే రెస్టారెంట్ ప్రత్యేకత వేరు. లోపలికి వెళ్లగానే కొత్తగా అనిపిస్తుంది. అక్కడ రోబోలు సర్వ్ చేస్తాయి.
రాజమహేంద్రవరం వై.జంక్షన్ సమీపంలోని ఈట్ అండ్ ప్లే రెస్టారెంట్‌కు వెళ్లగానే... ఐదు రోబోలు రండి రండి అంటూ స్వాగతం పలుకుతాయి. లోపలికి వెళ్లగానే రోబో సినిమాలో రజనీకాంత్‌కు చెందిన ల్యాబ్‌లోకి వెళ్లినట్టే ఉంటుంది. కానీ అక్కడ మనకు కావాల్సిన ఆహారం దొరుకుతుంది. మీరు సీట్లో కూర్చున్న వెంటనే ఓ రోబో మీ దగ్గరకు వస్తుంది.
మీరు అస్సలు భయపడాల్సిన పనిలేదు. అది ఆర్డర్ కోసం వస్తుంది. మీకు కావాల్సిన ఫుడ్ చెప్పగానే తిరిగి వంటశాలకు వెళ్తుంది. వేడివేడి ఆహారాన్ని మీ టెబుల్ దగ్గరకు తీసుకొస్తుంది. అవి సర్వ్ చేస్తూ ఉంటే కొత్తగా అనిపిస్తుంది. ఇక్కడకు వచ్చిన వారు వాటిని చూస్తూ ఎంచక్కా ఆహారం లాగించేస్తున్నారు.
ఈట్ అండ్ ప్లే రెస్టారెంట్ నిర్వాహకులు 5 రోబోలు తీసుకొచ్చారు. అందులో రెండు మాత్రమే నిరంతరాయంగా వినియోగదారులకు సేవలందిస్తున్నాయి. మిగతా 3 అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకుంటాయి. వినియోగదారులకు విభిన్న తరహాలో సేవలందించేందుకు ఈ రోబోలను ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెబుతున్నారు. రోబో సేవలు పొందిన వినియోగదారులు హోటల్ నుంచి సరదాగా ఇళ్లకు వెళ్తున్నారు.
ఇదీ చదవండి: దినదినగండం.. మృత్యువుతో పోరాటం