వరదల సమయంలో సముద్రం నుంచి సంతానోత్పత్తి కోసం పులస చేపలు..గోదావరి నదిలోకి వస్తుంటాయి. వరదకు ఎదురీదడం వీటి ప్రత్యేకత. జులై నుంచి అక్టోబర్ చివరి వరకు సంతానోత్పత్తి చేసుకుని, తిరిగి సముద్రంలోకి వెళ్తుంటాయి. ఈ సమయంలోనే జాలర్లు వీటిని పట్టుకుంటారు. సముద్రంలో ఉన్నప్పుడు వీటిని వలస చేపగా పిలుస్తారు. ఉప్పు నీటి నుంచి మంచి నీటిలోకి రాగానే వీటి శరీర ఆకృతిలో స్పల్ప మార్పులు వస్తుంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. వీటి రుచి సైతం పెరుగుతుందని అంటున్నాయి.
అత్యధిక ధరలు
గోదావరిలో పులసలు ఎక్కువగా లభిస్తే ధర కాస్త అందుబాటులో ఉంటుంది. కానీ ప్రస్తుత సీజన్లో ఈ చేపలు తక్కువ సంఖ్యలో దొరుకుతున్నాయి. ఈ కారణంగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కిలో చేప రూ.5500 నుంచి రూ.7000 వరకు పలుకుతుంది. ఇటీవల రాజోలు నియోజకవర్గంలోని దిండి గ్రామంలో రెండు కిలోల పులస చేపలను ఒక వ్యక్తి రూ.31 వేలకు కొనుగోలు చేశారు. ఇదే నియోజక వర్గం పాసర్లపూడిలో రెండు కిలోల కన్నా ఎక్కువ బరువు ఉన్న పులసను ఓ వ్యక్తి రూ.22 వేలకు కొనుగోలు చేశారు. దీని బట్టి చూస్తే పులస ధరలు ఏ స్థాయిలో పెరిగిపోతున్నాయో అర్థమవుతుంది. కోనసీమలోని వశిష్ట, వైనతేయ, గౌతమి గోదావరి నది పాయల్లో నిత్యం సుమారు 600 మర పడవల్లో 1200 మంది వరకు మత్స్యకారులు పులస చేపల వేటలో నిమగ్నమవుతున్నారు.
తగ్గుతున్న లభ్యత
సహజంగా ఈ చేపలు ఎక్కువ కాలం సముద్రంలో ఉంటాయి. వీటిని వేటాడేందుకు జాలర్లు ఒడ్డునుంచి సుమారు 100 కిలోమీటర్లు సముద్రంలోకి వెళ్తుంటారు. సముద్రంలో పిల్ల పులసలనే వేటాడం, సంతానోత్పత్తి సమయంలో వేట, జలకాలుష్యం ఇతరత్రా కారణాలతో వీటి లభ్యత ఏడాదికేడాది తగ్గిపోతుందని గణాంకాలు చెబుతున్నాయి. ఒక అంచనా ప్రకారం 2016లో సుమారు 6 వేల పులసలు దొరికాయి. వీటిని బట్టి ప్రతి ఏటా 20 శాతం చొప్పున ఉత్పత్తి పడిపోయి... ఈ సీజన్లో 1500 చేపలు మాత్రమే దొరికినట్టు అంచనా. పులసలు దొరకటం తగ్గిపోతున్న క్రమంలో ధరలు పెరుగుతున్నాయి.
పరిశోధనలు
పులస చేపల ఉత్పత్తి తగ్గిపోవడానికి గల కారణాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. పశ్చిమ బంగా రాష్ట్రంలోని బరక్పూర్లో గల సెంట్రల్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లో వీటిపై పరిశోధనలు జరుగుతున్నాయని... రాజోలు మత్స్యశాఖ సహాయ సంచాలకుడు వి.కృష్ణారావు తెలిపారు. పులస పిల్లలను ఉత్పత్తి చేసి వాటిని సముద్రంలోకి విడిచి పెడుతున్నారని తెలిపారు. అదేవిధంగా క్రియోప్రిజర్వేషన్(కణాలు, కణజాలలు గడ్డకట్టించి సంరక్షిస్తారు. వీటిని విట్రో కల్చర్ కోసం ఉపయోగిస్తారు) పద్ధతిపై కూడా పరిశోధనచేస్తున్నారని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి:
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల అదనపు కోటాను విడుదల చేసిన తితిదే