షిజ్జూ, గోల్డెన్ రిట్రీవర్, ల్యాబర్ డాగ్, హస్కీ, జర్మన్ షెఫర్డ్, చౌచౌ, సైంట్ బర్నర్, గ్రేడన్ ఇలా వందల రకాల శునకాల్ని జంతు ప్రేమికులు ఇళ్లల్లో పెంచుకుంటుంటారు. వీటికి రకరకాల ఆహార పదార్థాలు అందించడం ఓ ఎత్తయితే..వ్యాధి బారిన పడకుండా సంరక్షించుకోవడం మరో ఎత్తు. శునకాలు, పిల్లులు వంటి జంతువులకు స్నానం, హెయిర్ కటింగ్ వంటి పనులు అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అందుకే జంతు ప్రేమికుల కోసం పెట్ గ్రూమింగ్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. రాజమహేంద్రవరంలో స్కూబీ స్క్రబ్ పేరిట గ్రూమింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఇక్కడ పెంపుడు కుక్కలకు వెంట్రుకలు, గోర్లు కత్తిరించడం, చెవులు, దంతాల శుభ్రం చేయడం, హెయిర్, మెడికల్ బాత్, టిక్ బాత్ చాలా శుభ్రంగా చేస్తారు. దిల్లీలో 45 రోజులు శిక్షణ తీసుకుని దీనిని ఏర్పాటు చేశామని నిర్వహకురాలు లావణ్య చెబుతున్నారు. కొంచెం కష్టమైనా.. మూగ జీవాలపై ప్రేమతో ఎంతో ఇష్టంగా చేస్తున్నానని అంటున్నారు.
ఈ గ్రూమింగ్ కేంద్రంలో సేవలపై పెంపకం దారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 4 నెలల క్రితం ఏర్పాటు చేసిన ఈ స్కూబీ కేంద్రానికి ..ఉభయగోదావరి జిల్లాల నుంచి మంచి ఆదరణే వస్తోంది.
ఇదీ చదవండి: విశాఖలో సముద్రంలోకి తాబేళ్లు...