GODAVRI FLOODS: గోదావరి వరద పోటుతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని కొండగుట్టలపైకి వెళ్లిన విలీన మండలాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. పదిరోజులుగా విషసర్పాల మధ్య చీకట్లో బతుకెళ్లదీస్తున్నారు. తిండికి, తాగేనీటికి కటకటలాడుతున్నారు.
రికార్డు స్థాయిలో వచ్చిన గోదావరి వరద.. పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలం మద్దిగట్ల గ్రామాన్ని పూర్తిగా ముంచెత్తింది. గ్రామస్తులంతా....సమీపంలోని కొండగుట్టలపైకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. అప్పటి నుంచి ఈ కొండగుట్టలపైనే గుడారాలు వేసుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సాయంత్రమైతే చిమ్మచికట్ల మధ్య జీవిస్తున్నారు. ప్రభుత్వం అందించే అరకొర నిత్యావసరాలు, తాగునీళ్లు ఏమాత్రం సరిపోవడం లేదని వాపోతున్నారు. గత్యంతరం లేక వరద నీటిని వారంతా తాగుతున్నారు. గుట్టలపైకి వచ్చి పదిరోజులైనా తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
వరద వల్ల పిల్లల చదువులు పూర్తిగా తుడుకుపెట్టుకుపోయాయి. ఊరిని వరద ముంచెత్తినప్పుడల్లా గ్రామస్థులు పాఠశాలలో తలదాచుకునేవారు. కానీ ఈసారి వచ్చిన వరద.. పాఠశాలను కూడా ముంచెత్తడంతో ఆ ప్రభావం విద్యార్థుల చదువులపై పడింది. మద్దిగట్ల ప్రాథమిక పాఠశాలను వరద నీరు చుట్టుముట్టడంతో.. అందులోని పుస్తకాలు, పరీక్ష పేపర్లు, ఒకటో తరగతి విద్యార్థులకు విద్యా కానుక కింద వచ్చిన పుస్తకాలు పాడైపోయాయి.
వరద ముంపును అంచనా వేయడంలో అధికారులు విఫలం కావడంతో కొన్ని గ్రామాల ప్రజలు చివరి క్షణంలో... కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు చేరుకున్నారు. వేలేరుపాడు మండలం ఎర్రబోరు సహా పలు గ్రామాల ప్రజలు బండ్లబోరు వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్నారు. ప్రభుత్వం తమకు ప్యాకేజీ ఇచ్చి పునరావాసం కల్పించాలని వారంతా వేడుకుంటున్నారు. ప్రతిసారీ వరద ముంచెత్తడం...పిల్లాజెల్లాతో కలిసి... గుట్టల్లో తలదాచుకునే పరిస్థితి తలెత్తకుండా ప్రభుత్వం త్వరగా ప్యాకేజీ ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు.
RAJAMAHENDRAVARM: పైనుంచి వరద తగ్గినా.. పల్లెల్లో పరిస్థితి దారుణంగా ఉంది. దాదాపు వారం రోజులు ఇళ్లలో ఉండిపోయి బయటకు వచ్చిన జనానికి.. ఒక అడుగు తీసి మరో అడుగు ఎక్కడ వేయాలో తెలియని పరిస్థితి. కాలువ ప్రవాహం పల్లెలోకి రాకుండా ఆపేందుకు గట్టు లేనందువల్ల.. తలెత్తిందీ సమస్య. రాజమహేంద్రవరం గ్రామీణ పరిధిలో కనిపిస్తున్నాయీ దశ్యాలు.
బొమ్మూరు లోతట్టు కాలనీలతో పాటు.. నవభారత్ నగర్, హుకుంపేట పరిధిలోని సావిత్రి నగర్‌లో.. మురుగునీరు భారీగా చేరింది. ఆవ కాల్వలోకి గోదావరి ప్రవాహం పోటెత్తడంతో.. వారంపాటు జనం పడవల్లోనే ప్రయాణించారు. ఇప్పుడు గోదావరి శాంతించినా.. పరిస్థితి మారలేదంటున్నారు. ఆవ కాల్వను ఆధునీకరించి వరద ముంపు నుంచి రక్షించాలంటూ.. స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
KONASEEMA: గోదావరి వరదలు.. సామాన్యుల జీవన విధానాన్ని అతలాకుతలం చేశాయి. కోనసీమ జిల్లా పి.గన్నవరం, మామిడికుదురు, అయినవిల్లి, మలికిపురంలో వరద కారణంగా ఇళ్లు కోల్పోయిన బాధితులు ఏటి గట్లను ఆశ్రయించారు. గూడు లేక ఏటిగట్లపైనే పాకలు వేసుకుని జీవిస్తున్నారు. వర్షాలు తగ్గేవరకూ సొంత ప్రాంతానికి వెళ్లలేమని..మరో 2 నెలలు ఏటి గట్టు తమకు ఆధారమని చెబుతున్నారు. తమకు అనువైన వసతి కల్పించాలని బాధితులు అభ్యర్థిస్తున్నారు.
ALLURI: అల్లూరి జిల్లా కూనవరం-వీఆర్పురం మండలాల మధ్య నుంచి వెళ్లే శబరితో పాటు.. గోదావరికి వచ్చిన వరదను తలచుకుని స్థానికులు ఇప్పటికీ వణికిపోతున్నారు. 1986 కంటే దారుణమైన వరద చూశామని చెబుతున్నారు. ముందస్తు సమాచారం లేక తీవ్రంగా నష్టం పోయామని..... ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలి.. 25 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయామని చెప్తున్నారు.
ఇవీ చదవండి: