NGT On Illegal sand mining: తూర్పుగోదావరి జిల్లాలో సముద్రతీరాన ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమంగా రొయ్యల చెరువుల ఏర్పాట్లు భారీగా ఉంటున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన చర్యలు లేవని చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్ అసంతృప్తి వ్యక్తంచేసింది. అదే జిల్లాకు చెందిన వెంకటపతిరాజు 2020లో వేసిన ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ చెరువుల కేసులో మంగళవారం విచారణ జరిగింది. తీరంలో నిర్విరామంగా సాగుతున్న అక్రమ తవ్వకాలపై ఈ నెల 14న ‘ఈనాడు’ తూర్పుగోదావరి జిల్లా ఎడిషన్‌లో ప్రచురితమైన ‘తీరం.. ఇదేం ఘోరం’ కథనం బెంచ్ దృష్టికి వచ్చింది. దాన్ని పరిశీలించాక... ఆ కథనానికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానమివ్వాలని ఆదేశాలు జారీచేసింది. మరోవైపు 20 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునూ అక్కడి అధికారులు అమలు చేయడంలేదని పిటిషన్ తరఫు న్యాయవాది శ్రవణ్‌కుమార్ ట్రైబ్యునల్ దృష్టికి తీసుకెళ్లారు. వేల సంఖ్యలో అక్రమ చెరువులు, భారీగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నా.. నామమాత్ర చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు ఈ మధ్యే జాయింట్ కమిటీ ప్రత్యేక నివేదికను ఇచ్చిందని, అక్రమ తవ్వకాలు వాస్తవమేనని అందులో పేర్కొందని, దీనిపై ఏం చర్యలు తీసుకున్నారో వివరంగా నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుతాన్ని ఎన్జీటీ ఆదేశించింది. అక్రమాలపై చర్యలు తీసుకునేందుకు ఈ కేసులో రెవెన్యూ, మత్స్యశాఖలతో పాటు కోస్టల్ ఆక్వా అథారిటీని ఇంప్లీడ్ చేశారు. విచారణను మార్చి 22కు వాయిదా వేశారు.
ఇదీ చదవండి : SLV ISSUE ON HC: ఎస్‌ఎల్వీ సొసైటీ కేసులో జాప్యంపై హైకోర్టు ఆగ్రహం