రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి తెలుగుదేశం నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా విడుదలయ్యారు. జైలు వద్ద ఆయనకు తెదేపా నేతలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పట్టాభి స్వాగతం పలికారు. ప్రభుత్వం కుట్రలు చేసినా న్యాయ దేవత అనుగ్రహంతో విడుదలయ్యానని దేవినేని అన్నారు. అక్రమ నిర్బంధాలు చేసినంత మాత్రాన.. మైనింగ్‌పై చేస్తున్న పోరాటం ఆగదని చెప్పారు. ఇక.. హత్యాయత్నం, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టైన దేవినేని ఉమకు... బుధవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సంబంధిత పత్రాలు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం అధికారులకు అందడంలో ఆలస్యం కావడం వల్ల.. ఆయన ఇవాళ జైలు నుంచి విడుదలయ్యారు.
అసలేం జరిగింది..
కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో.. గ్రావెల్ అక్రమ మైనింగ్ జరుగుతుందనే ఆరోపణల నిజ నిర్ధారణకు వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమాపై వైకాపా వర్గీయులు రాళ్ల దాడి చేశారు. ఇది వైకాపా, తెలుగుదేశం వర్గీయుల మధ్య బాహాబాహీకి దారితీసింది. పోలీసులు లాఠీఛార్జి చేశారు. వాహనం ధ్వంసంతోపాటు.. పలువురు గాయపడేందుకు కారణమైన వ్యక్తులను అరెస్టు చేయాలని కోరుతూ.. వాహనంలోనే దేవినేని ఉమా నిరసనకు దిగారు. దాదాపు ఆరు గంటలపాటు కారులోనే నిరసన తెలిపిన ఉమాను.. పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. కారు అద్దం ధ్వంసం చేసి.. లోపలి నుంచి తలుపు తీసి.. ఉమాను బయటకు లాగారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణతో దేవినేని ఉమాను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. దాడి జరిగిందని ఫిర్యాదు చేసేందుకు వచ్చిన దేవినేని ఉమా.. కారులో నుంచి దిగకుండా ఇబ్బంది పెట్టేలా.. ఉద్దేశపూర్వకంగా ఘర్షణలు తలెత్తేలా వ్యవహరించారని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా రెచ్చగొట్టే వైఖరిని ప్రదర్శించిన కారణంగానే ఆయనపై కేసులు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా వివిధ సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు చేశారు. అనంతరం ఆయన్ను రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ దేవినేని ఉమ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం చివరికి.. బెయిల్ మంజూరు చేయగా.. ఆయన ఇవాళ విడుదలయ్యారు.
ఇదీ చదవండి: