విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్స్, ఉపకార వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా హిందూపురంలో టిఎన్ఎస్ఎఫ్ నిరసన చేపట్టింది. స్థానిక తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసి కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. విద్యార్థులకు బకాయిపడ్డ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో.77 వల్ల, సుమారు 70వేల మంది పీజీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. వెంటనే దాన్ని రద్దు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
నెల్లూరులో రాస్తారోకో..
విద్యార్థుల పాలిట శాపంగా మారిన జీవో.77ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో టిఎన్ఎస్ఎఫ్ ఆందోళన చేపట్టింది. నగరంలోని వీఆర్సీ సెంటర్ వద్ద రాస్తారోకో చేపట్టి నినాదాలు చేసింది. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసేలా ప్రభుత్వం జీవోను తీసుకొచ్చిందని టిఎన్ఎస్ఎఫ్ నేత ఆశిక్ ఆవేదన వ్యక్తం చేశారు. దాని కారణంగా ఉపకార వేతనాలు అందవని చెప్పారు. జీవోను రద్దు చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
చిత్తూరులో విద్యార్థి సంఘాల నేతల ర్యాలీ..
జీవో.77ను రద్దు చేయాలని చిత్తూరులో విద్యార్థి సంఘాల నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. లక్షమంది విద్యార్థులకు పీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలు రద్దు చేయడంపై రేణిగుంటలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి విమానాశ్రయం వరకు ర్యాలీ చేపట్టారు. పోలీసులు విద్యార్థి సంఘాల నేతలను అడ్డుకుని అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి: 'కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేందుకే వ్యవసాయ చట్టాలు'