నెల్లూరు ఆటోనగర్ ఆక్రమణలను అధికారులు తొలగించారు. గత 30 ఏళ్లుగా.. రహదారి పక్కన చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకుని వాహనాల రిపేరు చేస్తూ ఎంతో మంది కార్మికులు జీవనాధారం పొందుతున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా దాదాపు వంద దుకాణాలను అధికారులు తొలగించారు. ప్రత్యామ్నాయం చూపకుండా, సమయం కూడా ఇవ్వకుండా బంకులు(దుకాణాలు) తీసేయడం వల్ల నష్టపోయామని కార్మికులు ఆవేదన చెందారు. బంకులు తొలగించాలని రెండు రోజుల క్రితమే అధికారులు చెప్పారని, సమయం అడిగినా ఇవ్వలేదని వాపోయారు.
తమకు దుకాణ సముదాయం నిర్మిస్తామని ఏపీఐఐసీ అధికారులు గతంలో రూ. 5 వేలు డీడీలు కట్టించుకుని, మళ్లీ వెనక్కి ఇచ్చేశారని చెప్పారు. తమకు ఓ దారి చూపిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి... ఇప్పుడు తమ గోడు పట్టించుకోలేదన్నారు. ఇటీవల వర్షాల వల్ల దుకాణాలు మార్చేందుకు అధికారులు ఇచ్చిన సమయం సరిపోలేదని చెప్పిన పట్టించుకోలేదన్నారు. ఈ తెల్లవారుజామున జేసీబీతో బలవంతంగా బంకులు కూల్చివేశారని కార్మికులు ఆరోపించారు. ఫలితంగా దుకాణాల్లోని సామాగ్రి దెబ్బతిని తీవ్రంగా నష్టపోయామని కార్మికులు అంటున్నారు. ప్రభుత్వం తమకు ప్రత్యామ్నాయం చూపాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి : గుమ్మనూరు పేకాట ఘటన విచారణ సీబీఐకి ఇవ్వండి... హైకోర్టులో పిటిషన్