నెల్లూరులో పాలన అస్తవ్యస్తంగా ఉందని తెలుగుదేశం పార్టీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. నగరంలో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైందని మండిపడ్డారు. స్వయానా మంత్రి గౌతమ్ రెడ్డి ఆదేశాలను సైతం అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. తన క్యాంపు కార్యాలయం వద్ద పారిశుద్ధ్యం మెరుగుపర్చాలని ఎన్నిసార్లు చెప్పినా స్పందించకపోవటంతో... హెల్త్ ఆఫీసర్పై చర్యలు తీసుకోవాలని మంత్రి గౌతమ్ రెడ్డి స్వయంగా జిల్లా కలెక్టర్కు లేఖ రాశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
సొంత కార్యాలయాల వద్ద పనులు చేయించుకోలేని మంత్రులు... నగరాన్ని ఎలా సుందరంగా తీర్చిదిద్దుతారని శ్రీనివాసులు రెడ్డి ప్రశ్నించారు. మరోవైపు విద్యుత్తు బిల్లులు కట్టుకోలేని స్థితిలో ప్రజలు ఉంటే... వారి వద్ద నుంచి ఇంటి పన్నులు వసూలు చేయాలని మంత్రి చెప్పడం బాధాకరమన్నారు. పన్నులు కట్టేందుకు ప్రజలకు జనవరి దాకా సమయం ఇవ్వాలని.. లేకపోతే ఆందోళన చేపడతామని ప్రకటించారు.