నెల్లూరు నగరంలోని ప్రధాన కూడలిలో రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీపావళి పండుగను అందరూ ఆనందంగా జరుపుకుంటున్న తరుణంలో ఈ ప్రమాదం జరగటంతో నగరవాసులు ఉలిక్కిపడ్డారు. కోట్లాది రూపాయలు విలువ చేసే ప్లాస్టిక్ సామాన్లు అగ్నికి ఆహుతయ్యాయి. గంటల తరబడి అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. జిల్లా కలెక్టర్ స్వయంగా ఘటనా స్థలానికి వచ్చి సహాయక చర్యలను పర్యవేక్షించారు
గంటల తరబడి...
నెల్లూరులో ప్రధాన కూడలిగా పేరు పొందినది.... చిన్నబజారు. ఇక్కడ నిత్యం కోట్లాది రూపాయల్లో వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్న కనకదుర్గ ఎంటర్‌ప్రైజెస్ అనే ఓ ప్లాస్టిక్ దుకాణంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పెట్రోకెమికల్స్‌తో తయారు చేసిన సామాన్లు కావటంతో... గంటల తరబడి మంటలు బుసకొడుతూనే ఉన్నాయి
అగ్నిమాపక యంత్రాలు వచ్చినా...
రాత్రి 9 గంటల సమయంలో అగ్నిప్రమాదం జరగ్గా... తొమ్మిదిన్నరకు ఒక అగ్నిమాపక యంత్రం ఘటనా స్థలానికి చేరుకుంది. 10 గంటల తర్వాత రెండో అగ్నిమాపక యంత్రం వచ్చినా మంటలు అదుపులోకి రాలేదు. జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షించారు. 11 గంటల తర్వాత మరో రెండు అగ్నిమాపక యంత్రాలు వచ్చినా మంటలు అదుపు చేయలేకపోయారు.
ఇంత నిర్లక్ష్యమా సస్పెండ్ చేస్తా....
ఇంత పెద్ద ప్రమాదం జరిగినా... ఘటనాస్థలానికి విద్యుత్ శాఖ డీఈ రాకపోవటంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. భవనంపై ఉన్న థర్మాకోల్ షీట్లపై నిప్పురవ్వలు పడటమే ప్రమాదానికి కారణమై ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా అనే కోణంలోనూ అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే భవనంలో ఉన్న ఆరు కుటుంబాలను బయటకు తరలించారు.
అగ్నిమాపక శకటం ఆలస్యంగా రావటంతో పాటు, మంటలను అదుపు చేసేందుకు అవసరమైన సామాగ్రి పూర్తిస్థాయిలో లేకపోవటం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని స్థానికులు అంటున్నారు
ఇవీ చూడండి-ఇసుక కొరత... మరో కార్మికుడి ప్రాణం తీసింది