AUTO ACCIDENT AT SANGAM: నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి సంగానికి మూడు కి.మీ దూరంలో నెల్లూరు-ముంబయి జాతీయ రహదారిపై వస్తున్న ఆటోను.. ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులతో వస్తున్న ఆటో ఎగిరి బీరాపేరు వాగులో పడిపోయింది.
ఈ ప్రమాదంలో మెుత్తం అయిదుగురు గల్లంతయ్యారు. మిగిలిన ఏడుగురిలో ముగ్గురు ఈదుకుంటూ బయటకు రాగా.. మరో నలుగురిని స్థానికులు, పోలీసులు రక్షించారు. వీరిలో నాగవల్లి (14) అనే బాలిక మృతి చెందింది. ఆటోలో ప్రయాణిస్తున్న వారంతా ఒకే కుటుంబానికి చెందినవారని తెలుస్తోంది.
ఆత్మకూరు జ్యోతినగర్‌కు చెందిన కె.నాగభూషణం కుటుంబసభ్యులు సంగంలోని సంగమేశ్వరాలయంలో నిద్ర చేసేందుకు ఆటోలో బయలుదేరారు. బీరాపేరు వాగు వంతెన పైకి చేరుకోగానే.. ఎదురుగా వచ్చిన రెండు లారీలు ఒకదానికొకటి అధిగమించే క్రమంలో ఆటోను ఒక లారీ ఢీకొట్టింది. దాంతో ఆటో 15 అడుగుల దిగువనున్న వాగులో పడిపోయింది.
అటుగా వెళ్తున్న వారు గమనించి.. పోలీసులకు తెలిపారు. నందు, నాగసాయి, నాగభూషణం అనే యువకులు ఈదుకుంటూ వాగు లోంచి బయటకు చేరుకున్నారు. లక్ష్మీదేవి, కృష్ణకుమారి, నాగవల్లి, నవదీప్ అనే నలుగురిని స్థానికులు, పోలీసులు బయటకు తీసుకొచ్చారు. సంపూర్ణమ్మ, పుల్లయ్య, నాగరాజు, పద్మ, ఆదెమ్మ వాగులో గల్లంతయ్యారు. సంగం ఎస్సై నాగార్జున తన సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకొని ప్రజల సాయంతో సహాయక, గాలింపు చర్యలు చేపట్టారు. బాధితులను ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి:
Accident: ఆటోను ఢీకొన్న లారీ.. చిన్నారి మృతి.. వాగులో ఐదుగురు గల్లంతు