ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా భాజపా అవతరించిందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తెలిపారు. గుంటూరు కన్వెన్షన్ సెంటర్లో భాజపా పదాధికారుల సమావేశంలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 8 లక్షల బూత్ కమిటీలు కలిగిన ఏకైక పార్టీగా భాజపా ఆవిర్భవించడం సంతోషమని తెలిపారు. ఈ విజయయాత్ర మనలో ప్రబోధాన్ని నింపాలని పేర్కొన్నారు. 'సబ్ కా వికాస్' అనేది పార్టీ మూలసూత్రంగా భావిస్తున్నామని చెప్పారు. భాజపా అనేది కార్యకర్తల పార్టీగా అభివర్ణించారు. కులాల, గ్రూపు రాజకీయాలు తన పార్టీలో ఉండవని, అందుకే గత ఎన్నికల్లో దేశంలో 23 కోట్ల మంది తమకు మద్దతుగా ఓటేశారని గుర్తు చేశారు. పార్టీ సభ్యత్వాన్ని 16 కోట్లు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. భాజపాకు అధికారం పరమావధి కాదని... నూతన రాజకీయ సంస్కృతి తీసుకురావడమే లక్ష్యమని స్పష్టం చేశారు. మోదీ నూతన విధానాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని... అలాంటి పరిస్థితే ఏపీలో సైతం కనిపిస్తోందని చెప్పారు. ఈ సానుకూల పరిణామాలను పార్టీ శ్రేణులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏపీలో ఎన్నికల ఫలితాలపై భాజపాకు నిరుత్సాహకరమైన ఫలితాలు రావడం విచారకరమని... దీనిని సవాల్‌గా తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో పార్టీని తెలంగాణలో మాదిరిగా బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు.
ఇదీ చదవండి... కమలం పెద్దలు.. గుంటూరుకు వస్తున్నారు