కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం గర్భిణులకు వరప్రదాయిని అవుతోంది. ప్రతి నిత్యం ఎంతో మంది గర్భిణులు ఈ ఆసుపత్రికి వస్తుంటారు. ఎంతమంది వచ్చినా... అందరికీ ఎంతో ప్రేమగా వైద్యసేవలు అందిస్తూ... సుఖప్రసవాలు చేయటంలో... ముందువరుసలో నిలుస్తున్నారు ఇక్కడి వైద్యులు. 2017లో అన్ని మౌలిక వసతులతో ఆపరేషన్ థియేటర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత మూడేళ్లలో 4 వేల సాధారణ ప్రసవాలు, 1500 వరకు సిజేరియన్ ప్రసవాలు విజయవంతంగా నిర్వహించారు. ఒక్క మరణం కూడా సంభవించలేదంటే అతిశయోక్తి కాదు.
ఆళ్లగడ్డ ఆసుపత్రిలో సుఖప్రసవాలకు కారణం ఇద్దరు మహిళా వైద్యులు. గైనకాలజిస్టు డాక్టర్ ఎం సుజాత, మత్తు వైద్యురాలు డాక్టర్ ఆర్ ఉమాదేవి. మహిళ గర్భందాల్చినప్పటి నుంచి ప్రతి నెలా పరీక్షలు నిర్వహిస్తారు. 5వ నెల నుంచి స్కానింగ్ ద్వారా బిడ్డ అవయవాల ఎదుగుదలను పర్యవేక్షిస్తారు. బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచి ఎప్పటికప్పుడు తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని పరిశీలిస్తూ... తగు వైద్యసేవలు అందిస్తున్నారు. రక్తనిధి కేంద్రం ద్వారా తరచుగా రక్తం సేకరిస్తూ... అవసరమైన గర్భిణులు, బాలింతలకు రక్తం ఎక్కిస్తారు. రక్తదానం కోసం కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 2 వేల యూనిట్ల రక్తం సేకరించగా... ఇందులో 1330 యూనిట్ల రక్తం గర్భిణులకు సిజేరియన్ సమయంలో ఎక్కించారంటే అతిశయోక్తి కాదు. గతేడాది మే నెలలో అత్యధిక ప్రసవాలు చేసినందుకుగాను... 30 పడకల ఆసుపత్రుల విభాగంలో మొదటి స్థానంలో నిలిచారు.
కరోనా సమయంలోనూ....
సాధారణ రోజుల్లోనే కాదు. కరోనా సమయంలోనూ... ఏమాత్రం భయపడకుండా... ఆసుపత్రిలో ప్రసవాలు నిర్వహిస్తున్నారు ఈ వైద్యులు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో 400కు పైగా డెలివరీలు నిర్వహించి శెభాష్ అనిపించుకున్నారు. ఎంత కష్టమైనా ఇక్కడే ప్రసవాలు నిర్వహిస్తున్నారు. ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్తే కనీసం 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు బిల్లుల మోత మోగిస్తారు. ఇక్కడ ఒక్కరూపాయి కూడా తీసుకోకుండా... తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ... హాయిగా ఇంటికి పంపిస్తారు. ఇందులోనే తమకు ఆనందం ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఈ ఇద్దరు వైద్యులు ఏ సమయంలో ఫోన్ చేసినా స్పందిస్తారు. ఎన్నోసార్లు అర్ధరాత్రులు సైతం ఆసుపత్రులకు వచ్చి ఆపరేషన్లు చేశారు. ఒక్కో సారి ఉదయం 7 గంటలకు వస్తే... సాయంత్రం వరకు నిర్విరామంగా డెలివరీలు నిర్వహిస్తారు. రోగుల సేవలో తరిస్తున్న ఈ వైద్యులు నిజంగా ఆదర్శనీయులు.
ఇదీ చదవండి
'మళ్లీ పుట్టిన గాంధీ'... ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు?: రఘురామ