కర్నూలు గడ్డపై వైకాపా జెండా ఎగిరింది. పురపోరులో తిరుగులేని ఆధిపత్యాన్ని చూపింది. కర్నూలు నగరపాలక సంస్థతో పాటు ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, ఆత్మకూరు, నందికొట్కూరు, డోన్, ఆళ్లగడ్డ మున్సిపాలిటీలతో పాటు గూడూరు నగర పంచాయతీ ఫలితాల్లో దూసుకెళ్లింది. మొత్తం 9 పురపాలికల్లో 302 వార్డులు ఉండగా.. 77 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 225 వార్డులకు పోలింగ్ నిర్వహించారు. ఏకగ్రీవాలతో కలుపుకుని అధికార వైకాపా 256, తెదేపా 23, స్వతంత్రులు 19, భాజపా 3, సీపీఐ ఒక వార్డులో విజయం సాధించింది.
కర్నూలు నగరపాలికలో వైకాపా జోరును సాగించింది. మొత్తం 52 వార్డులకు గానూ 41 స్థానాల్లో పాగా వేసింది. ఇక ప్రధాన ప్రతిపక్షం 8, స్వతంత్రులు 3 స్థానాల్లో గెలుపొందారు. ఫలితంగా మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు వైకాపాకే దక్కనున్నాయి. ఇక నంద్యాల మున్సిపాలిటీలో ఉన్న 42 వార్డుల్లో 37 వైకాపా, నాలుగు స్థానాల్లో తెదేపా, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఆదోనిలోని 42 వార్డుల్లో వైకాపా 40, తెదేపా 1, స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలిచారు.
ఎమ్మిగనూరు 34 వార్డుల్లో.. వైకాపా 31 స్థానాల్లో విజయదందుభి మోగించింది. ప్రధాన ప్రతిపక్షం కేవలం 3 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఆర్థిక మంత్రి బుగ్గన ఇలాకా.. డోన్‌లోని 32 వార్డుల్లో.. 31 స్థానాల్లో వైకాపా జెండా ఎగిరింది. ప్రతిపక్ష తెదేపా కనీసం ఒక్క వార్డు కూడా గెలవలేదు. సీపీఐ ఒక స్థానాన్ని గెలుచుకుంది. ఆత్మకూరులోని 24 వార్డుల్లో వైకాపా 21, తెదేపా 1, స్వతంత్రులు ఇద్దరు గెలుపొందారు. ఆళ్లగడ్డలోని 27 వార్డుల్లో.. అధికార పార్టీ 22, ప్రతిపక్ష తెదేపా 2, భాజపా 2, స్వతంత్రులు ఒకచోట సత్తా చాటారు. జిల్లాలో అత్యంత ఆసక్తిని రేపిన నందికొట్కూరులోనూ అధికార పార్టీ జోరు కొనసాగింది. 29 వార్డుల్లో 21 స్థానాల్లో వైకాపా, తెదేపా 1, స్వతంత్రులు ఏడుగురు విజయం సొంతం చేసుకున్నారు. గూడూరు నగర పంచాయితీలో 20 వార్డులకు గాను.. 12 వైకాపా, 3 తెదేపా, 1 భాజపా, నలుగురు స్వతంత్రులు గెలుపొందారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో 14 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలు సాధించి.. కర్నూలును కంచుకోటగా మార్చుకున్న అధికార వైకాపా... పురపాలిక ఎన్నికల్లోనూ ఫ్యాన్ జోరుకు తిరుగులేదని చాటిచెప్పారు. భారీ విజయం సాధించటంతో పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.
ఇదీ చదవండి