ప్రశ్న: కర్నూలు ట్రిపుల్ ఐటీడీఎంపై కొవిడ్ ప్రభావం ఎలా ఉంది?
జవాబు: కొవిడ్- 19 ప్రారంభమైనప్పటినుంచి విద్యార్థులకు క్యాంపస్‌లో తరగతులు జరగలేదు. అప్పటినుంచి విద్యార్థులకు ఆన్లైన్లో తరగుతులు బోధిస్తున్నాం. విద్యార్థులు క్యాంపస్‌కు వచ్చాక ప్రాక్టికల్స్‌కు ఎక్కువ సమయం కేటాయించి బోధిస్తాం. ఉద్యోగాలకు వెళ్లేవారికి అకడమిక్ సంవత్సరంలో ఇబ్బంది లేకుండా... తరగతులు నిర్వహించాం. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఆరోగ్యం దృష్ట్యా క్యాంపస్‌లో తరగతులు ఆలస్యం అవుతున్నాయి.
ప్రశ్న: ఈ విద్యా సంవత్సరం ఎప్పటి నుంచి ప్రారంభంమవుతుంది.? విద్యార్థులు క్యాంపస్‌కు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది?
జవాబు: జూలై 26 నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంకావాలి. కాని ఆగస్టు 2 నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాం. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత విడతల వారీగా... విద్యార్థులను క్యాంపస్‌కు రప్పించడానికి చర్యలు తీసుకుంటాం. సెప్టెంబర్ నెల చివరి వారం నాటికి విద్యార్థులు వచ్చే అవకాశం ఉంది.
ప్రశ్న: క్యాంపస్‌లో వ్యాక్సినేషన్ సహా కొవిడ్ నిబంధనలు ఎలా అమలు చేస్తున్నారు ?
జవాబు: కొవిడ్ నిబంధనల్లో భాగంగా... ప్రతి రోజూ క్యాంపస్‌ను శానిటైజ్ చేస్తున్నాం. బోధన సిబ్బంది అంతా వ్యాక్సిన్ వేయించుకున్నారు. విద్యార్థులందరూ వ్యాక్సిన్ వేయించుకున్నతర్వాతనే... క్యాంపస్‌కు తీసుకురావాలని భావిస్తున్నాం. జగన్నాథగట్టు ప్రాంతంలో జనసంచారం తక్కువగా ఉన్నందున ఇక్కడ కరోనా ప్రభావం ఎక్కువగా ఉండదని భావిస్తున్నాం.
ప్రశ్న: అడ్మిషన్ల ప్రక్రియ ఎంత వరకు వచ్చింది?
జవాబు: ఇక్కడ పీహెచ్డీ, ఎంటెక్, అండర్ గ్రాడ్యుయేట్... ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాం. వీటిలో ఇప్పటికే పీహెచ్డీ ప్రోగ్రాం అడ్మిషన్లు పూర్తి చేసేశాం. 20 మంది పీహెచ్డీ స్కాలర్స్‌ను ఎంపిక చేశాం. వీరికి తరగతులు సైతం ప్రారంభమయ్యాయి. గేట్ పరీక్షలో ఉత్తర్ణీత సాధించిన వారికి... ఎంటెక్‌లో అడ్మిషన్లు ఇవ్వటం జరుగుతుంది. ఇక అండర్ గ్రాడ్యుయేషన్ విషయానికొస్తే.. జేఈఈ మెయిన్స్ ఆలస్యం అయ్యింది. ఇవి కాస్తంత ఆలస్యం అవుతున్నమాట వాస్తవమే.
ప్రశ్న: భవన నిర్మాణాలు, ఇతర పనులు ఎంతవరకు వచ్చాయి?
జవాబు: ప్రస్తుతం క్యాంపస్‌కు వచ్చే విద్యార్థులకు సరిపడా తరగతి గదులు ఉన్నాయి. 350 మంది విద్యార్థులకు వసతి సదుపాయం ఉంది. విద్యార్థుల సంఖ్య 6 వందల వరకు ఉంది. గతేడాదే బిల్డింగ్స్ నిర్మాణం ప్రారంభం కావాల్సి ఉన్నా... కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం పనులు మొదలయ్యాయి. డిసెంబర్ 2022 నాటికి అన్ని భవనాలు పూర్తవుతాయి. 500మందికి సరిపడా జీప్లస్ 10 హాస్టల్ ఒకటి, 2 వందల మందికి సరపడా మరో హాస్టల్ నిర్మాణాలు జరుగుతున్నాయి.
ప్రశ్న: అధ్యాపకుల కొరత గతంలో ఉండేది. ఈ సమస్య పరిష్కారం అయ్యిందా?
జవాబు: ప్రస్తుతానికి కొరత లేదు. 31 పోస్టులు మంజూరు చేశారు. 21 మంది ఇప్పటికే ఉన్నారు. మరో పది పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాం. ఈ నెలలో వారిని కూడా తీసుకుంటాం. మరో 10 మందిని పరిశ్రమలకు చెందిన నిపుణులను తీసుకువచ్చి... వారితో కూడా పాఠాలు చెప్పిస్తాం.
ప్రశ్న: నూతన విద్యా విధానాన్ని ట్రిపుల్ ఐటీలో అమలు చేస్తున్నారా?
జవాబు: నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) చాలా మంచిది. కొత్త ఇన్స్టిట్యూట్ కాబట్టి... దీనిని మొదటి నుంచి అర్థం చేసుకుంటే... ఇంటర్ డిసిప్లినరీ కోర్సులు బాగా నిర్వహించగలం. ఎన్ఈపీ ద్వారా ప్రతి డిపార్ట్మెంట్లో ఒక మైనర్ ప్రోగ్రామ్ ప్రారంభించాం. దీని ద్వారా ఏ బ్రాంచ్ విద్యార్థులైనా... ఈ కోర్సులు తీసుకోవచ్చు. ఈ కోర్సు కోసం అడ్మిషన్లు గతేడాదే మొదలు పెట్టాం. అన్ని సీట్లు పూర్తయ్యాయి.
ప్రశ్న: గతేడాది విద్యార్థులకు మంచి ఉద్యోగావకాశాలు వచ్చాయి. ఈ ఏడాది పరిస్థితి ఎలా ఉందా?
జవాబు: 60 శాతం మందికిపైగా విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చాయి. సరాసరి రూ. 6 లక్షల ప్యాకేజీ వచ్చింది. కొందరికి రూ. 12 నుంచి 15 లక్షల ప్యాకేజీ వచ్చింది. మరికొందరు ఉన్నత చదువులకు వెళ్లారు. ముగ్గురు విద్యార్థులు విదేశాల్లో అడ్మిషన్లు సాధించారు. కొత్తగా ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్‌ను ప్రారంభించాలని భావిస్తున్నాం. ఇంటర్ డిసిప్లినరీ కల్చర్ బాగా పెరుగుతుంది. కొన్ని ల్యాబ్స్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నాం.
ప్రశ్న: ఇంకా కొత్త కోర్సులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించారా?
జవాబు: పరిశ్రమలతో ఎంఓయూలు కుదుర్చుకున్నాం. వీటి ద్వారా సాఫ్ట్వేర్ శిక్షణ నిర్వహించాం. జీరో కోడ్ అనే కంపెనీతో సర్టిఫికేట్ కోర్సులు నిర్వహిస్తున్నాం. డిగ్రీ, డిప్లొమో లాంటి విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వాలని భావిస్తున్నాం.
ఇదీ చదవండి..
Fake challans: నకిలీ ఈ చలానాల కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్