గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 38,746 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 864 కరోనా కేసులు, 12 మరణాలు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. కరోనా నుంచి మరో 1,310 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,652 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
జిల్లాల వారీగా కరోనా కేసులు, మృతులు
అనంతపురంలో 7, చిత్తూరులో 101, తూర్పుగోదావరిలో 135, గుంటూరులో 91, కడపలో 117, కృష్ణాలో 52, నెల్లూరులో 141, ప్రకాశంలో 114, శ్రీకాకుళంలో 34, విశాఖపట్నంలో 52, విజయనగరంలో 3, పశ్చిమగోదావరిలో 17 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ఒక్క కేసూ నమోదు కాలేదు. కరోనాతో చిత్తూరులో నలుగురు, కృష్ణాలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు మరణించారు.
ప్రత్యేక డ్రైవ్‌లో 28.63 లక్షల మందికి వ్యాక్సిన్
రాష్ట్రంలో ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు మూడు రోజులపాటు నిర్వహించిన ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో 18-44 ఏళ్ల మధ్య వయసున్న 28,63,445 మందికి కొవిడ్ టీకాలు వేసినట్లు ప్రభుత్వం సోమవారం తెలిపింది. ప్రతి జిల్లాలో సగటున 2.5 లక్షల మందికి టీకాలు వేశామని పేర్కొంది. ఈ డ్రైవ్ ద్వారా కొవిడ్ టీకాల్లో రాష్ట్రం రెండు మైలురాళ్లను అధిగమించిందని ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 3.5 కోట్ల డోస్‌ల కొవిడ్ వ్యాక్సిన్లు వేశాం. ఇందులో కోటి మందికి రెండు డోసులూ పూర్తయ్యాయని వివరించింది. ‘మూడు రోజుల ప్రత్యేక డ్రైవ్‌లో ఉదయం 7 గంటలకే వార్డు సచివాలయాల్లో వ్యాక్సిన్ వేయడం ప్రారంభించారు. వైద్యులు, నర్సులు, ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, వాలంటీర్లు ఫోన్‌లు, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ప్రజలకు సమాచారం అందజేయడంతో పాటు, విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల కార్యక్రమం విజయవంతమైంది’ అని ప్రభుత్వం ప్రకటించింది.
ఇదీచదవండి.