కాకినాడ సాగరతీరంలో టీయూ-142 యుద్ధవిమాన ప్రదర్శనశాల ఏర్పాటుకు గోదావరి నగరాభివృద్ధి సంస్థ చర్యలు చేపట్టింది. సముద్రగస్తీలో రెండున్నర దశాబ్దాలకుపైగా కీలకపాత్ర పోషించి నిష్క్రమించిన ఈ యుద్ధవిమానాన్ని నావికాదళం కాకినాడకు కేటాయించింది. ఇప్పటికే విశాఖలో ఈ విమాన ప్రాజెక్టు అక్కడివారిని ఆకర్షిస్తుండగా.. దాని తరహాలోనే కాకినాడలోనూ అభివృద్ధి చేస్తున్నారు. గుడా ఆధ్వర్యంలో రూ.5కోట్ల 89లక్షల అంచనా వ్యయంతో ప్రాజెక్టు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇంతకుముందు కాకినాడ బీచ్‌లోని పార్కులో ఏర్పాటు చేసిన దీపక్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాంగణంలోనే దీన్నీ ఏర్పాటు చేస్తున్నారు.
తనేజా ఏరోస్పేస్ ఆధ్వర్యంలో విమాన విడిభాగాల అమరిక జరుగుతోంది. ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని ప్రాజెక్టు హెడ్ కెప్టెన్ వెంకటేష్ తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కాకినాడ బీచ్‌కు మరింత పర్యాటక గుర్తింపు వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
"భారత నావికాదళం ఈ రకానికి చెందిన 8 ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనుగోలు చేసింది. ఇవన్నీ కలిపి 33వేల గంటలకుపైగా ప్రయాణించాయి. ఒక్కసారి కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇది అతిపెద్దదైన ఎయిర్‌క్రాఫ్ట్ మాత్రమే కాదు... సురక్షితమైనది కూడా. 'విజయ్' వంటి ఎన్నో ఆపరేషన్లలో పాల్గొంది. తమిళనాడు అరక్కోణంలోని ఐఎన్‌ఎస్ రజాలిలో ఈ ఎయిర్‌క్రాఫ్ట్ భాగాలను విడదీశారు. రోడ్డు మార్గం ద్వారా అవి కాకినాడ బీచ్‌కు చేరుకున్నాయి. వీటి అమరిక ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తాం. వైమానికరంగం గురించి తెలుసుకోవడానికి విద్యార్థులకు ఎంతో ఉపకరిస్తుంది." -వెంకటేశ్, ప్రాజెక్టు హెడ్ కెప్టెన్
ఇదీ చదవండి: ఎస్‍ఈసీ కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ.. నాలుగు వారాలకు వాయిదా