Tiger in kakinada: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో పులి ఇంకా చిక్కలేదు. రాత్రి మరో దూడను పులి చంపినట్లు అటవీశాఖ అధికారుల వెల్లడించారు. పొదురుపాక, శరభవరం, ఒమ్మంగి పరిసరాల్లో దూడను చంపినట్లు తెలిపారు. పులిని బంధించేందుకు అధికారులు మూడు బోన్లు ఏర్పాటు చేశారు. రాత్రి బోన్ల వద్దకు పులి వచ్చి వెళ్లినట్లు గుర్తించించారు. రోజుల తరబడి పులి సంచారంతో గ్రామాల్లో భయాందోళనకు గురవుతున్నారు. పులిని త్వరగా బంధించి పంపించేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ పనులు ఆగిపోతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tiger in kakinada: కాకినాడ జిల్లాలో 13 రోజులుగా పెద్ద పులి సంచారంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. శుక్రవారం పొదురుపాక వద్ద ఆవుని చంపిన పులి.. గురువారం రాత్రి శరభవరం వద్ద రెండు గేదెలపై దాడి చేసింది. పులి దాడి నుంచి గేదెలు గాయాలతో తప్పించుకున్నాయి. పులి దాడులతో ఒమ్మంగి, పోతులూరు, పొదురుపాక, పాండవులపాలెం, శరభవరంలో.. తీవ్ర అలజడి నెలకొంది. పులిని అడవికి పంపేందుకు.. అటవీ, వణ్యప్రాణి సంరక్షణ అధికారులు చర్యలు ప్రాంభించారు. ఇప్పటివరకు పులి కదలికలపై నిఘా పెట్టడం, పాదముద్రలు సేకరించడం, సీసీ కెమెరాలు అమర్చడం వంటివి చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. తాజాగా పులిని బోనులో రప్పించేందుకు ఆవు మృత కళేబరాన్ని బోనులో అమర్చారు. పోతులూరు వద్ద ఉన్న మూడు బోనుల్ని పొదురుపాక తరలించారు. మృత కళేబరాన్ని బోనుల్లో వేసి పులి అందులోకి వచ్చేలా చిక్కేలా ఆపరేషన్ చేపట్టారు. ఎప్పటికప్పుడు స్థావరం మార్చడం, పశువులు అందుబాటులో ఉండటం, నీరు, ఆవాసానికి అనువుగా ఉండటంతో పులి బోనులోకి రావడంపై ఉత్కంఠ నెలకొంది.
యంత్రాంగం ఉరుకులు: జూన్ 2న పొదురుపాక సమీపంలోని పశువుల పాకపై పంజా విసిరింది. ఒక ఆవును వేటాడి సమీప తోటల్లోకి ఈడ్చుకెళ్లి, ఆవు మెడ భాగం కొంత తినేసి వెళ్లింది. రంగంలోకి దిగిన అధికారులు.. రిజర్వు ఫారెస్టు వైపు మళ్లిందనే అంచనాకు వచ్చేలోపే వెనుదిరిగి పంజా విసరడంతో గురువారం ఉదయం అటవీయంత్రాంగమంతా పొదురుపాక వైపు ఉరుకులు పెట్టింది. వైల్డ్‌లైఫ్ డీఎఫ్‌వో సెల్వం, జిల్లా అటవీఅధికారి ఐకేవీ రాజు, స్క్వాడ్ డీఎఫ్‌వో ఎన్వీ ప్రసాదరావు, ఏసీఎఫ్ సౌజన్య, రేంజరు వరప్రసాదరావు సిబ్బంది ఆవును వేటాడిన ప్రదేశం, పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. పోతులూరు నుంచి పొదురుపాకకు బేస్ క్యాంపు మార్చారు. పులిని పట్టి తరలించే వాహనాన్ని అక్కడే ఉంచారు. బోనులను పోతులూరు వద్ద సిద్ధంగా ఉంచారు.
ఎస్‌టీసీఏ బృందం రాక: పులి జాడ తెలిసినప్పటి నుంచి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్‌టీసీఏ) ఇక్కడి యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తోంది. ఆవును వేటాడిన నేపథ్యంలో ఎన్‌టీసీఏ ముగ్గురు సభ్యులతో కూడిన బృందం మండలానికి వచ్చింది. పులి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తోంది. పులిని బంధించే విషయమై డీఎఎఫ్‌వో ఛైర్మన్‌గా వైల్డ్‌లైఫ్ డీఎఫ్‌వో, ఎన్టీసీఏ ప్రతినిధి, పశుసంవర్ధక ఏడీ, సర్పంచితో కూడిన బృందం రోజువారీ పరిణామాలను ఇక్కడి పరిస్థితులను ఉన్నత వర్గాలకు నివేదించి నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు.
నిశితనిఘా..: పులి సంచరించే వీలున్న మార్గాల్లో 40 కెమెరా ట్రాప్‌లు ఏర్పాటుచేసి నిఘా వేశారు. ఒమ్మంగి, పోతులూరు, కొడవలి మధ్య సంచరించి ఊదరేవడి మెట్టపై బస చేసిన పెద్దపులికి నాలుగైదేళ్లు వయసు ఉండొచ్చని అంచనా. 180 కేజీలకు పైనే బరువు.. ఆరున్నర అడుగుల పొడవు ఉంటుందని చెబుతున్నారు. వేటాడే క్రమంలో దారి తప్ఫి. విజయనగరం జిల్లా ఎస్.కోట - అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మీదుగా వందల కిమీ ప్రయాణించి ఇటు వచ్చినట్లు గుర్తించారు. ఒమ్మంగి సమీపంలో రెండు గేదెలను వేటాడిన పులి.. ఆహార అన్వేషణకు అనుకూలతతో ఊదరేవడి మెట్టపైనే మకాం పెట్టినట్లు భావిస్తున్నారు. మెట్టకు 6 కి.మీ. దూరంలో పాండవులపాలెం వైపు వెళ్లిందని బుధవారం కన్పించిన పాదముద్రల ఆధారంగా తెలుస్తోంది. అక్కడికి సమీపంలో అభయారణ్యం ఉండడంతో బెబ్బులి గమనం అటువైపు ఉంటుందా.. ఆహారం రుచి మరిగిన పులి వెనక్కి వస్తుందా అనే భయాందోళన నెలకొంది.
క్షణక్షణం..: పులి సంచారంతో సమీప ఆరు గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. జాతీయ జంతువు కావడంతో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్‌టీసీఏ) మార్గదర్శకాల ప్రకారం కమిటీ ఏర్పాటుచేసి.. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాలి. కమిటీ ఏర్పాటు చేసినా.. పరిస్థితి చేయిదాటితేనే రెస్క్యూ ఆపరేషన్ వరకు వెళ్లే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు. కెమెరా ట్రాప్‌ల ద్వారా కదలికలపై నిశిత నిఘా వేశారు. పులికి ఎలాంటి హాని కలగకుండా అడవి వైపు గమనం సాగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పాండవులపాలెం సమీపంలో చెరువు వద్ద పులి పాదముద్రలు గుర్తించిన అధికారులు దాదాపు అటవీ ప్రాంతం వైపు వెళ్లినట్లేనని భావిస్తున్నామని వన్యప్రాణుల సంరక్షణ విభాగం డివిజనల్ అధికారి సెల్వం చెప్పారు. మరికొద్దిరోజులు నిశిత పరిశీలన తర్వాత స్పష్టతకు వస్తామన్నారు.
మే 23: ఒమ్మంగి సమీపంలోని సరుగుడు తోటల్లో రెండు గేదెలు వేర్వేరు రోజుల్లో చనిపోయినట్లు గుర్తింపు. అడవి జంతువులు చంపేసినట్లు అనుమానంతో అటవీ అధికారులకు రైతుల ఫిర్యాదు.
మే 24: గేదెను వేటాడిన తీరు, పాదముద్రల ఆధారంగా క్రూర మృగమని అంచనా. నిఘా కెమెరాల ఏర్పాటు.
మే 25: పులి సంచారంపై చుట్టుపక్కల గ్రామాల్లో కలకలం.
మే 26: పులి సంచరించే వీలున్న మార్గాల్లో కెమెరా ట్రాప్‌ల అమరిక.
మే 27: పోతులూరు ఊదరేవడి మెట్ట వద్ద గేదెను చంపిన పులి. పర్యవేక్షణకు అటవీశాఖ ప్రత్యేక బృందాల నియామకం.
మే 28: పోతులూరు పరిసరాల్లో పెద్ద పులి సంచరిస్తున్న దృశ్యాలు నిఘా కెమెరాల్లో నిక్షిప్తం.
మే 29: డీఎఫ్‌వో రాజు, వన్యప్రాణి సంరక్షణ విభాగం డీఎఫ్‌వో సెల్వం, శిక్షణ ఐఎఫ్‌ఎస్ భరణి ఆధ్వర్యంలో 150 మంది సిబ్బందితో కొడవలి పంపు హౌస్ వద్ద బేస్ క్యాంపు ప్రారంభం.
మే 30: పెద్దపులి కదలికలు సీసీ కెమెరాల్లో మళ్లీ నిక్షిప్తం. ధర్మవరం సమీప పోలవరం కాలువ వరకు వెళ్లి, వెనక్కి మెట్ట దగ్గరకు వచ్చినట్లు గుర్తింపు.
మే 31: పోతులూరు ఊదరేవడిమెట్టపై మకాం వేసిన పెద్దపులి జాడ ట్రాకింగ్ కెమెరాల్లో కనిపించలేదు.
జూన్ 1: బెంగాల్ రాయల్ టైగర్‌గా గుర్తింపు. పాండవులపాలెం సమీప చెరువు వద్ద పులి పాదముద్రల గుర్తింపు. తోటపల్లి, బవురువాక రిజర్వ్ అటవీ ప్రాంతాలు ఉండటంతో అటు వెళ్లినట్లు అంచనా.
జూన్ 2: పాండవులపాలెం-పొదురుపాక సమీపంలో మళ్లీ పశువులపై పులి దాడి చేసి... ఆవును చంపింది.
జూన్ 3: పొదురుపాకలో వేటాడిన ఆవు కళేబరం వద్దకు మళ్లీ వచ్చిన పెద్దపులి... ఆవు కళేబరాన్ని కొంతమేర తినేసి వెళ్లింది.
జూన్ 4: మరో దూడను చంపింది. బోన్ల వద్దకు పులి వచ్చి వెళ్లినట్లు గుర్తించించారు.
ఇవీ చదవండి: