వైకాపా ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు సుబ్రహ్మణ్యం పోస్టుమార్టం విషయంలో కాకినాడ జీజీహెచ్ వద్ద ఉదయం నుంచి ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. మరోవైపు మృతుడి కుటుంబసభ్యులు అంగీకరించి సంతకం చేస్తేనే పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంటుంది. ఉదయం నుంచి కనిపించకుండా ఉన్న సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులను పోలీసులు కాకినాడ జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. శవపంచనామా కోసం కుటుంబసభ్యులను తీసుకెళ్లారు. శవపరీక్ష కోసం సంతకం పెట్టాలని బలవంతం చేస్తున్నారని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు వారిని కొట్టారని చెప్పారు. సుబ్రహ్మణ్యం భార్యను సైతం పోలీసులు బలవంతంగా లోపలికి తీసుకెళ్లినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఎమ్మెల్సీని అరెస్టు చేస్తేనే శవపరీక్షకు అంగీకరిస్తామని బాధితుడు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. అయితే కుటుంబసభ్యులను ఒప్పించేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. సామర్లకోట మున్సిపల్ వైస్ ఛైర్మన్ భార్య ద్వారా మంతనాలు చేస్తున్నారు.
న్యాయం చేయాలని డిమాండ్: ఎమ్మెల్సీని అరెస్టు చేయడంతో పాటు బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని కాకినాడు జీజీహెచ్ వద్ద ప్రజా సంఘాలు నిరసన చేపట్టాయి. హైకోర్టు న్యాయవాది శ్రవణ్ కుమార్ సహా ఎస్సీ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం కావాలని కుటుంబసభ్యులు కోరుతున్నారని.. నిందితుడైన ఎమ్మెల్సీని ఎందుకు రక్షిస్తున్నారని శ్రవణ్‌కుమార్ ప్రశ్నించారు. జీజీహెచ్ వద్ద పోలీసుల వైఖరి తీవ్ర ఆక్షేపణీయమన్న శ్రవణ్‌కుమార్.. నిందితుడిని వదిలేసి బాధితులను నిర్బంధించడం సరికాదన్నారు. శవపరీక్షకు అనుమతి ఇవ్వాలని బలవంతం చేయడం దారుణం అన్నారు. ఎమ్మెల్సీని అరెస్టు చేశాకే శవపరీక్ష జరపాలని ఎస్సీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా జీజీహెచ్ గేటు వద్ద ఆందోళన చేపట్టారు. జీజీహెచ్ వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఆందోళన చేస్తున్న న్యాయవాది శ్రవణ్ కుమార్ సహా ఎస్సీ సంఘాల నాయకులను పోలీసులు లోపలికి అనుమతించారు. కాకినాడ జీజీహెచ్ వద్ద భారీ సంఖ్యలో బలగాలు మోహరించాయి.
ఇదీ చదవండి: