తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్‌ఆర్ చేయూత పథకానికి అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాల నమోదు ప్రక్రియ రెండు రోజులుగా నిలిచిపోయింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందిస్తోన్న మీ-సేవలకు ప్రతిబంధకం ఏర్పడింది. ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్‌లో ఉన్న మీ-సేవల సర్వర్‌ను ఈనెల 18న రాత్రి 9 గంటల నుంచి నిలిపివేశారు. సర్వర్‌ను అక్కడి నుంచి అమరావతి తీసుకువచ్చి, ఇన్‌స్టాల్ చేసే క్రమంలో ఈ సేవలు ఆగిపోయాయి. ఈ కారణంగా.. సచివాలయాల్లో వైఎస్‌ఆర్ చేయూత పథకానికి సంబంధించిన కుల ధ్రువీకరణ పత్రాల నమోదు నిలిచిపోయింది.
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న మహిళలకు చేయూత పథకం ద్వారా ఏడాదికి రూ. 18,750 చొప్పున ఆర్థిక సాయం అందించడానికి దీనిని ప్రవేశపెట్టారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హుల నుంచి సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కుల ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుంటే, తద్వారా వచ్చే ఐడీ నంబరుతో ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. తాజాగా వైఎస్‌ఆర్ పింఛను కానుక పొందుతున్న ఈ వర్గాల మహిళలకు దీనిలో అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకోడానికి ఈనెల 21వ తేదీ వరకు గడువు ఇచ్చారు. దీంతో అర్హులైన మహిళలు సచివాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. ఇక రెండురోజులే గడువు ఉండటంతో అంతర్మథనం చెందుతున్నారు.
లక్ష్యాలు చేరేనా..?
వైఎస్‌ఆర్ చేయూత పథకంలో సుమారు నాలుగు లక్షల మందికి ప్రయోజనం కల్పించాలని తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం లక్ష్యాలు నిర్దేశించింది. ఆదివారం వరకు జిల్లాలో 1,84,000 మంది మాత్రమే దరఖాస్తు చేశారు. గ్రామ, వార్డు వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి అర్హులను గుర్తించి, దరఖాస్తు చేయించాలి. ఈ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఈ పథకం పర్యవేక్షణను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు అప్పగించారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా మిగతా పథకాలు అమలు చేస్తున్నారు. కానీ ఈ వర్గాలకు చెందిన మహిళలకు అమలు చేసే పథకం డీఆర్‌డీఏకు అప్పగించడంతో శాఖల మధ్య సమన్వయ లోపంతో ఆటంకాలు ఎదురవుతున్నాయి.
రెండు లక్షల పత్రాలు..
తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటి వరకు రెండు లక్షలకు పైగా కుల ధ్రువీకరణ పత్రాలు పెండింగ్‌లో ఉన్నాయి. సచివాలయాల ద్వారా ఆన్‌లైన్‌లో వీటి కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల మహిళలు దరఖాస్తు చేశారు. తహసీల్దారు కార్యాలయాల నుంచి వీటిని జారీ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 3,55,851 దరఖాస్తులు కుల ధ్రువీకరణ పత్రాల కోసం నమోదు చేసుకోగా, ఇప్పటి వరకు 1,33,554 మాత్రమే జారీ చేశారు. తహసీల్దారు కార్యాలయాల నుంచి వీటిని జారీ చేయకపోతే చేయూత పథకం సామాజిక తనిఖీకి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. వీటి జారీకి సత్వర చర్యలు చేపట్టాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.
లక్ష్యాలు పూర్తి చేస్తాం..
అర్హత ఉన్న ప్రతి మహిళకు చేయూత పథకం ద్వారా ఆర్థిక సాయం అందించడానికి చర్యలు తీసుకుంటున్నాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో కుల ధ్రువీకరణ పత్రాల కోసం నమోదు చేసుకుంటే, అక్కడ ఇచ్చే ఐడీ నంబరు ఆధారంగా దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించారు. ఈనెల 21వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది. అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసేందుకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నాం. జిల్లాలో నిర్థేశించిన లక్ష్యాలు పూర్తి చేస్తాం. రానున్న రెండురోజుల్లో పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసేలా చర్యలు చేపడతాం.
-వై.హరిహరనాథ్, పథక సంచాలకుడు, డీఆర్‌డీఏ
-
ఇదీ చదవండి: