తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం సరిహద్దులను నిర్దారిస్తూ కేంద్ర పర్యావరణ, అటవీశాఖ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. గత ఏడాది జనవరి 9న విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్‌పై ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ఈ తుది నోటిఫికేషన్‌ను ఇచ్చింది. కోరింగ రక్షిత అడవులు, దానికి అనుబంధంగా ఉన్న అటవీప్రాంతం, 235.70 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన భైరవపాలెం రక్షిత అటవీప్రాంతం ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలోకి వస్తుందని వెల్లడించింది. దీని చుట్టూ ఉన్న 177.30 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పర్యావరణ సున్నిత మండలంగా ప్రకటించింది.
ఈ ప్రాంతంలో మౌలిక వసతులను మరింత మెరుగుపరిచేలా జోనల్ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సూచించింది. పర్యావరణ సున్నిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను క్రమబద్ధీకరించేలా జోనల్ మాస్టర్ ప్లాన్‌లో నిబంధనలు విధించాలని పేర్కొంది. అన్ని ప్రార్థనా స్థలాలు, పల్లెలు, పట్టణ నివాస ప్రాంతాలు, అడవులు, వ్యవసాయ ప్రాంతాలు, సారవంత భూములు, హరిత వనాలు, ఉద్యానవనాలు, సరస్సులు, ఇతర నీటి వనరులను మాస్టర్‌ప్లాన్‌లో స్పష్టంగా చూపాలని పేర్కొంది. ఎకోసెన్సిటివ్ జోన్ పర్యవేక్షణకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది.
ఇదీచదవండి.