మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు ఉపయోగించిన ఆయుధాల అన్వేషణ ఆదివారానికి వాయిదా పడింది. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు పులివెందుల రోటరీ పురం వాగులో నీటిని తోడేసే ప్రక్రియ చేపట్టినప్పటికీ బురద నీరు తగ్గలేదు. మున్సిపల్ కార్యాలయానికి సంబంధించి రెండు ట్యాంకర్లతో నీటిని బయటికి పంపేందుకు అధికారులు ప్రయత్నించారు. రాత్రి అయినా నీరు తగ్గకపోవడంతో ఈరోజు పనిని ముగించారు.
ఆదివారం ఉదయం మళ్లీ వాగులో నీటిని తోడేసే ప్రక్రియ చేపట్టాలని మున్సిపల్ కార్మికులకు సీబీఐ అధికారులు సూచించారు. దీంతో ఆదివారం ఉదయం మళ్లీ ఆయుధాల అన్వేషణ కొనసాగనుంది. సునీల్ యాదవ్‌ను అదుపులోకి తీసుకుని సీబీఐ అధికారులు కడపకు వెళ్లిపోయారు. రేపు ఉదయం అధికారులు మళ్లీ పులివెందుల రానున్నారు.
విచారణకు స్టేషన్ మాస్టర్..
మరోవైపు.. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో శనివారం నలుగురు అనుమానితులను అధికారులు ప్రశ్నించారు. డ్రైవర్ దస్తగిరి, సుంకేసుల గ్రామానికి చెందిన ఉమా శంకర్ రెడ్డి, పులివెందులకు చెందిన చెప్పుల దుకాణం యజమాని మున్నాను అధికారులు ప్రశ్నించారు. అయితే ఉదయమే కడప రైల్వే స్టేషన్ మాస్టర్ మోహన్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారణ చేశారు. వారికున్న సమాచారం మేరకు స్టేషన్ మాస్టర్‌ను వివరాల కోసం పిలిచినట్లు తెలుస్తోంది.
సీబీఐ దూకుడు..
వివేకా హత్య కేసును (viveka murder case) సవాలుగా తీసుకున్న సీబీఐ అధికారులు విచారణలో దూకుడు పెంచారు. గత 62 రోజులుగా పలువురు అనుమానితులను విచారించారు. ఈ కేసులో అధికారులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. తాజాగా కీలక నిందితుడు సనీల్ యాదవ్‌ను అరెస్ట్ చేశారు. 2019 మార్చి 15న వివేకా దారుణహత్యకు గురికాగా..మార్చి 14 అర్ధరాత్రి పులివెందులలో అనుమానాస్పదంగా తిరిగిన పలు వాహనాల వివరాలను సేకరించి ఆ దిశగా విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి:
CBI COURT NOTICES: బెయిల్ రద్దు పిటిషన్‌లో విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు
murder case: స్థిరాస్తి వ్యాపారి హత్య కేసు.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు