పోలీసుల అదుపులో ఉన్న ఈ మోసగాడి పేరు.... ప్రసన్న కుమార్. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఇతడు ప్రశాంత్ రెడ్డి, రాజా రెడ్డి, టోనీ అని మారు పేర్లతో నయవంచనకు పాల్పడ్డారు. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతూ మానేసిన ఇతను.. చెడు వ్యసనాలకు, జల్సాలకు అలవాటు పడ్డాడు. 2017 లోనే గొలుసు దొంగతనాలు, ఇంట్లో చోరీలకు పాల్పడి అరెస్టయ్యాడు. ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లలో అతనిపై కేసులున్నాయి. 2020 సంవత్సరం నుంచి.. ఫేస్‌బుక్, షేర్ చాట్, ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిలు, మహిళలతో ఇతను పరిచయాలు పెంచుకున్నాడు. మాయమాటలతో కొందరిని లోబరుచుకుని.. ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇతని బారిన పడిన చాలామంది నుంచి.. డబ్బులు, బంగారు నగలు వసూలు చేశాడని పోలీసులు చెప్పారు. బయటకు వస్తే పరువు పోతుందని ఎవరూ ఫిర్యాదు చేయలేదని వెల్లడించారు.
ఎట్టకేలకు కడపకు చెందిన ఓ వ్యక్తి..ప్రసన్న కుమార్ మోసాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల అనుమతితో నిఘా పెట్టిన పోలీసులు.. అతన్ని పట్టుకున్నారు. విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని కడప డీఎస్పీ సునీల్ తెలిపారు. ఇప్పటివరకు 200 మంది అమ్మాయిలు, వంద మంది మహిళలను మోసగించినట్లు చెప్పారు. ప్రసన్న కుమార్‌పై ఇప్పటికే సస్పెట్ షీట్ ఉందని పోలీసులు చెప్పారు. అమ్మాయి, మహిళలు ఇలాంటి మోసగాళ్ల బారినపడవద్దని సూచించారు.