కడప జిల్లాలో అన్నమయ్య జలాశయం ముంపు గ్రామాల్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పర్యటించారు. జలాశయం కట్ట తెగిపోవడంతో వరద నీరు ఒక్కసారిగా పులపత్తూరు, మందపల్లి, శేషమాంబపురం, తొగురురుపేట గ్రామాలపై పడింది. దీంతో 35 మందికి పైగా ప్రజలు మృత్యువాత పడగా.. పశు సంపదకు అపారనష్టం జరిగింది. జలాశయం కట్ట తెగుతుందనే విషయం కానీ, తెగిన సమాచారం కానీ అధికారులు తెలపలేదని ముంపు గ్రామాల వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెగిపోయిన అన్నమయ్య జలాశయ కట్టను నేతలు పరిశీలించారు. రాజకీయ నాయకుల ఇసుక వ్యాపారం కోసం అన్నమయ్య జలాశయం గేట్లు ఎత్తకపోవడమే ప్రమాదానికి కారణమని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు స్వలాభం కోసం గేట్లను తెరవనీయకుండా అధికారులను బెదిరించడం కారణంగానే.. వారు గేట్లను సకాలంలో ఎత్తలేకపోయారని, ఫలితంగానే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని విమర్శించారు. అవినీతి అక్రమాలను పక్కన పెట్టి ప్రజలకు మంచి పాలన అందించాలని డిమాండ్ చేశారు.
సామాన్యులకు ఒక న్యాయం సీఎం మేనమామకు మరో న్యాయమా..?
కడప బుగ్గవంకలో నిర్మించిన ఆక్రమణల తొలగింపులో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వివక్ష చూపుతోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. బుగ్గవంక వరద పరివాహక ప్రజలకు పునరావాసం కల్పించకుండా.. ఆక్రమణలు తొలగించడం ఏంటని ప్రశ్నించారు. బుగ్గవంక ప్రవాహాన్ని, బాధితుల సమస్యలను కాల్వ శ్రీనివాసుల బృందం తెలుసుకుంది. 2001లో వచ్చిన వరదల కారణంగా బుగ్గవంకకు రక్షణ గోడలు నిర్మించాలని నిర్ణయించినా.. ఇప్పటివరకు వాటిని పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని కాల్వ విమర్శించారు. సీఎం జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి బుగ్గవంకను ఆక్రమించి సినిమా థియేటర్ నిర్మించినా.. వాటిని తొలగించకుండా పేదల ఇళ్లను కూల్చడం ఏంటని కాల్వ ప్రశ్నించారు. పేదలకు ఒక న్యాయం.. ముఖ్యమంత్రి జగన్ మేనమామకు ఒక న్యాయమా? అని నిమ్మల కిష్టప్ప ప్రశ్నించారు.
వరద బాధిత కుటుంబాలకు రూ. 10 వేలు ఇవ్వండి..
కడప నగరం జలమయం కావడానికి కారకులైన నగరపాలక సంస్థ పాలకవర్గాన్ని తక్షణం రద్దు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లనే కడప నగరం అతలాకుతలమైందని ధ్వజమెత్తారు. కడప వరద బాధితులను ఆదుకోవాలని, తక్షణ పరిష్కారం చూపాలని కోరుతూ కడప నగరపాలక ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. నగరపాలక అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అవినీతి అక్రమాలతో నిర్మించిన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నగరంలో కబ్జాకు గురైన చెరువులను, మురికి కాల్వలను బాగు చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కో వరద బాధిత కుటుంబానికి రూ. 10 వేలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
పంట నష్టం ఇన్సూరెన్స్ చెల్లించాలి..
రాయలసీమ ప్రాంతాల్లో అనావృష్టికి బదులు ఇటీవల కాలంలో అతివృష్టి ఎక్కువగా ఉందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. ఈ సంవత్సరం అతివృష్టికి రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం తోడైందన్నారు. గత సంవత్సరమే పింఛా ప్రాజెక్టు మొత్తం దెబ్బతిన్నదని, అప్పుడే శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదికాదన్నారు. ప్రజలను అప్రమత్తం చేయకపోవడం.. వారిని రిలీఫ్ క్యాంపులకు తరలించకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. సీఎం సొంత నియోజకవర్గమైన చక్రాయపేట మండలం అద్దాల మరి బ్రిడ్జి కొట్టుకుపోవడం వల్ల 14 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని అన్నారు. తుపాను ప్రభావంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. ఇన్సూరెన్స్ చెల్లించాలని అన్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి పక్కా గృహాలు కట్టించడంతో పాటు.. చెయ్యేరు పరీవాహ ప్రాంతాలలో ప్రభుత్వం ప్రకటించిన రూ.2 వేలు కాకుండా రూ. 10 లక్షల సహాయం అందించాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
YS Viveka Murder Case: వివేకా కేసులో శివశంకర్‌రెడ్డి కస్టడీకి సీబీఐ పిటిషన్