సంక్షేమ పథకాలను ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తుందనడానికి.. రేషన్ బియ్యం పంపిణీ పథకమే నిదర్శనమని మంత్రులు అంజద్ బాషా, ఆదిమూలపు సురేష్ అన్నారు. ఫిబ్రవరి నుంచి రేషన్ సరకులను లబ్ధిదారుల ఇంటి వద్దకే చేరవేసేందుకు .. కడప మున్సిపల్ మైదానంలో 514 వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. వాటిలో ఏ విధమైన సౌకర్యాలు ఉన్నాయి.. ఎలా పనిచేస్తాయనే వివరాలను మంత్రులు పరిశీలించారు.
సీఎం జగన్ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం.. అన్ని హామీలను నెరవేరుస్తున్నారని అంజద్ బాషా పేర్కొన్నారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే.. ప్రతిపక్షాలు కావాలనే రాజకీయాలు చేస్తున్నాయని ఆదిమూలపు సురేష్ విమర్శించారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వాహనాలు కడప నగరం చుట్టూ తిరిగే విధంగా ప్రణాళిక రూపొందించగా.. అన్నీ కలిసి ర్యాలీగా వెళ్లాయి.
రాయచోటిలో...
లబ్ధిదారులకు రేషన్ సరుకులు సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాలను.. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జకియా ఖానం రాయచోటిలో ప్రారంభించారు. వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. జెండా ఊపి మొదలుపెట్టారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎక్కడా లేని విధంగా వినూత్న కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారని కొనియాడారు. రేషన్ కోసం కార్డుదారులు దుకాణాల వద్ద కు వెళ్ళి క్యూలో నిలబడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందించేందుకు 9,260 వాహనాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు.
ఇదీ చదవండి: కడపలో హోంగార్డుల ఎంపిక ప్రారంభం