MODEL SCHOOLS: ఆదర్శ పాఠశాలల్లోని బాలికల వసతి గృహాలకు బిల్లుల చెల్లింపు నిలిచిపోవడంతో విద్యార్థులకు భోజనం అందించలేక ప్రిన్సిపాళ్లు చేతులెత్తేసున్నారు. వసతి గృహంలో ఉన్న పిల్లల్ని ఇళ్లకు వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు గుత్తేదార్లకు చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో చాలాచోట్ల సరకుల సరఫరా నిలిపివేశారు. ఈ పరిస్థితుల్లో పిల్లలకు భోజనం అందించడం కష్టంగా ఉందంటూ ఈనెల 3న జిల్లా విద్యాధికారి, ఉన్నతాధికారులకు కడప జిల్లా ఖాజీపేట ప్రిన్సిపాల్ సమాచారం ఇచ్చారు. దీనిపై అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో సోమవారం రాత్రి నుంచి భోజనం అందించలేమని, పిల్లల్ని ఇళ్లకు వెళ్లిపోవాలని సూచించారు. ఆరు నెలలుగా రూ.6 లక్షల వరకు బకాయిలు చెల్లించలేదని, గుత్తేదారు నిత్యావసర సరకులు పంపిణీ చేయలేదని, దీంతో వసతి గృహం మూసివేయాల్సి వచ్చిందని ప్రిన్సిపల్ సురేష్ తెలిపారు. పిల్లల భోజనానికి ఆయన ఇప్పటి వరకు రూ.80వేలు సొంత డబ్బును సైతం ఖర్చు చేశారు.
ఈటీవీ కథనానికి స్పందన...
ఈ విషయంపై ‘ఈటీవీ’లో కథనం రావడంతో స్పందించిన అధికారులు మంగళవారం రాత్రి అందుబాటులో ఉన్న 30 మంది విద్యార్థినులకు భోజనం అందించారు. బుధవారం నుంచి మిగిలిన పిల్లలూ వస్తారని చెప్పారు. అందరికీ భోజనం అందించాలని ప్రిన్సిపాల్‌ను వారు ఆదేశించారు. మరోవైపు వసతి గృహాన్ని మంగళవారం మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఖాజీపేట ఎంపీపీ అబుబుకార్ సిద్ధిక్, వైకాపా నాయకులతో కలిసి తనిఖీ చేసి బాలికలతో మాట్లాడారు. ప్రిన్సిపల్‌పై అనేక ఆరోపణలున్నాయని ఫోన్ ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే డిమాండు చేశారు. దీంతో ప్రిన్సిపల్ ఎం.సురేష్‌బాబును సస్పెండ్ చేస్తూ మంగళవారం ఆర్జేడీ ఎం.వెంకటకృష్ణారెడ్డి ఉత్తర్వులిచ్చారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై చట్టబద్ధమైన చర్యల్లో భాగంగా సస్పెండు చేసినట్లు చెప్పారు. విద్యార్థులకు భోజన వసతి కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, మెనూ ప్రకారం భోజనాలు అందించకపోవడం, నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో సస్పెండు చేసినట్లు ఆర్జేడీ తెలిపారు. ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌గా అదే పాఠశాలలో పనిచేస్తున్న ఎకనమిక్స్ అధ్యాపకురాలు డి.విజయభారతిని నియమించారు. సొంతంగా ఖర్చు పెట్టి, ఇక భరించలేక పిల్లలకు భోజనం పెట్టలేనని ఇళ్లకు పంపిస్తే ఆ ప్రిన్సిపాల్‌ను సస్పెండు చేయడం ఏమిటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతూ మరోపక్క మెనూ ప్రకారం పిల్లలకు భోజనం పెట్టలేదని సస్పెండు చేయడం ఎంతవరకు సబబు అన్న ప్రశ్న వినిపిస్తోంది.
ఇదీ పరిస్థితి..
రాష్ట్ర వ్యాప్తంగా 164 ఆదర్శ పాఠశాలలుండగా.. వీటికి అనుబంధంగా 145 బాలికల వసతి గృహాలు ఉన్నాయి. వీటిల్లో దాదాపు 10వేల మంది విద్యార్థినులు ఉంటున్నారు. 9 నుంచి ఇంటర్మీడియట్ వరకూ చదివేవారు ఇక్కడ వసతి పొందుతున్నారు. ఒక్కో విద్యార్థినికి మెస్ ఛార్జీల కింద నెలకు రూ.1,500 చొప్పున చెల్లిస్తారు. గత విద్యా సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ నెల బిల్లును ప్రభుత్వం చెల్లించలేదు. ఇది పెండింగ్‌లో ఉండగానే సెప్టెంబరు నుంచి మళ్లీ వసతి గృహాలను పునఃప్రారంభించారు. ఒక పక్క ధరలు పెరగడం, మరోపక్క బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో పెట్టుబడి పెట్టలేక గుత్తేదారులు సరకుల సరఫరా నిలిపివేస్తున్నారు. కొన్నిచోట్ల అరకొరగా సరఫరా చేస్తున్నారు. దీంతో ప్రిన్సిపాళ్లు సొంత డబ్బులతోనో..అప్పులు చేసో పిల్లలకు మెనూ ప్రకారం భోజనం పెట్టాల్సి వస్తోంది. ఈ అప్పుల బాధలు భరించలేక కడప జిల్లా వల్లూరు ఆదర్శ పాఠశాలలో వసతి గృహాన్ని ఇప్పటి వరకు తెరవలేదు. పిల్లల భోజనాల కోసం ఈ ప్రిన్సిపల్ గత ఏడాది సుమారు రూ.2.40లక్షలు ఖర్చు చేశారు. ఈ బిల్లుల డబ్బు గుత్తేదారు ఖాతాలో పడగా.. ఆయన ప్రిన్సిపాల్‌కు ఇవ్వలేదు.
నిర్వహణ ఖర్చులు లేవు..
వసతి గృహాల్లో మరుగుదొడ్లు, గదుల శుభ్రత, తాగునీటి బోర్ల మరమ్మతులు, ఇతరాత్ర ఖర్చులకు ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వడం లేదు. నిర్వహణకు నిధులు ఇవ్వాలని ప్రిన్సిపాళ్లు ఇటీవల ఉన్నతాధికారులను కోరినా దీన్ని వారు పట్టించుకోలేదు. దీంతో నిర్వహణ కోసమూ ప్రిన్సిపాళ్లు జేబుల నుంచే డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది.
ఇదీ చదవండి:
Fake CBI Officers Gang Arrest: నకిలీ సీబీఐ అధికారుల ముఠా అరెస్ట్