కడప జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణాలు, గ్రామాలు జలమయం అవుతున్నాయి. శనివారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఏకధాటిగా భారీ వర్షం కురవడంతో.. రహదారులు వర్షపు నీటితో నిండిపోయాయి. దీంతో.. పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కడప జిల్లా లక్కిరెడ్డిపల్లెలో 111.6 మిల్లీ మీటర్లు, రాయచోటిలో 110.2 మిల్లీ మీటర్ల చొప్పున అత్యధిక వర్షపాతం నమోదయింది. రాయచోటి రాజంపేట మధ్య సద్దికూళ్ళ వంక ఉదృతంగా ప్రవహించడంతో.. రాయచోటి -రాజంపేట, సుండుపల్లి రాయవరం మధ్య రాకపోకలు స్తంభించాయి. వరద ప్రవాహానికి చాలాచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి.
కడప నగరం కూడా భారీ వర్షానికి తీవ్రంగా ప్రభావితమైంది. నగరం జలమయం అయింది. ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు, అంబేడ్కర్ కూడలి, ఆర్టీసీ కార్మికుల భవనాల సముదాయం చుట్టూ వర్షం నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ గ్యారేజ్ లోకి భారీగా వర్షపు నీరు రావడంతో కార్మికులు అవస్థలు పడ్డారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో.. వర్షపునీరంతా రోడ్లను ముంచేసింది. భాగ్యనగర్ కాలనీ, అప్సర రోడ్డు, మృత్యుంజయ కుంట, గంజికుంట కాలనీ, ప్రకాష్ నగర్, రామరాజు పల్లి, అల్లూరి సీతారామరాజు నగర్ తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
వరద నీరు పంట పొలాలను ముంచెత్తడంతో రైతులు భారీగా నష్టపోయారు. వరి, వేరుశనగ, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా.. వరి పంట పొట్ట విప్పి, గింజ పోసే దశలో వర్షం దెబ్బతీయడంతో.. వెన్ను విరిగి నేల వాలిపోయింది. దీంతో.. పంట చేతికొచ్చే దశలో తీవ్రంగా రైతులు ఆవేదన చెందుతున్నారు.
అనంతపురం జిల్లాలో..
కదిరి పరిసర మండలాల్లో వేకువజాము నుంచి కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నియోజకవర్గంలోని ముత్యాల చెరువు, దేవర చెరువు, పంతుల చెరువు నిండిపోయాయి. వీటికి తోడు తెల్లవారుజాము నుంచి కురుస్తోన్న మోస్తరు వర్షంతో నీటి ప్రవాహం మరింత పెరిగింది. ఫలితంగా కదిరి మండలం ఎర్రదొడ్డి వద్ద మాదిలేరు వాగు ప్రవాహ ఉధృతి పెరిగింది.
ఇదీ చదవండి:
KRMB and GRMB: ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణకు సిద్ధమవుతున్న బోర్డులు