రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని రహస్యంగా ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం చూస్తుంటే.. త్వరలో రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు తులసి రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు కడప జిల్లా వేంపల్లిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని రహస్యంగా ఉంచాలని ముఖ్యమంత్రి కార్యాలయ.. ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌కు ఆదేశాలివ్వడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ ప్రభుత్వం.. శక్తికి మించిన అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో 1956 నుంచి 2014 వరకు 58 ఏళ్ల కాలంలో లక్ష కోట్ల రూపాయలు అప్పు చేస్తే.. జగన్ ప్రభుత్వం రెండేళ్ల కాలంలో ఏకంగా రెండు లక్షల అరవై మూడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిందని విమర్శించారు. ఇంత మొత్తంలో అప్పులు చేసినా.. రాష్ట్రంలో ఉద్యోగులు, పింఛన్‌దారులకు సకాలంలో వేతనాలు, పింఛన్లు అందడం లేదన్నారు. ఆర్థిక స్థితిని పారదర్శకంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి..: SOFTWARE SUISIDE: పెళ్లికావడం లేదని సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య