మాజీమంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక నిందితుడు ఉమాశంకర్ రెడ్డి నాలుగు రోజుల సీబీఐ కస్టడీ ముగిసింది. పులివెందుల కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు... నిందితుణ్ని నాలుగు రోజుల పాటు కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో కస్టడీలో విచారించారు. అతడి నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటల లోపు కోర్టులో హాజరు పరచాలని కోర్టు ఆదేశాలు ఉండటంతో.. ఉమాశంకర్ రెడ్డిని కడప నుంచి పులివెందుల తీసుకెళ్లారు. నాలుగు రోజుల కస్టడీ ముగియడంతో అతన్ని కోర్టులో హాజరు పరిచారు. వివేకా హత్యలో సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి ప్రమేయం ఉందని సీబీఐ ఇది వరకే కోర్టుకు విన్నవించింది. ఉమాశంకర్ రెడ్డి వాడిన ఆయుధాల కోసం, మరికొందరు నిందితుల పాత్ర తెలుసుకోవడానికి కస్టడీకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఉత్కంఠగా కౌంటింగ్..అస్వస్థతకు గురైన తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి