కడప జిల్లాలో రవాణాశాఖ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారాయి. రవాణశాఖ అధికారులే ఏజెంట్లను ప్రోత్సహిస్తూ... వాహనదారులను అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ వ్యవహారంపై నిఘా పెట్టిన అనిశా... వసూళ్లకు పాల్పడుతున్న అధికారుల బండారాన్ని బహిర్గతం చేసింది. ముడుపులు ఎవరెవరికి అందిస్తున్నారనే విషయంపై దృష్టి సారించింది.
రెచ్చిపోతున్నారు....
అవినీతిరహిత పాలన అందించేందుకు అధికారులు సహకరించాలని... మూడు నెలల కిందట అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తి చేస్తోంది. అయితే అలవాటు పడిన అధికారుల చేతులు...అవినీతి మకిలి నుంచి బయటపడేలా కనిపించడం లేదు. రవాణాశాఖ కార్యాలయంలో పనిచేసే కొందరు అధికారులు మరింత రెచ్చిపోతున్నారు. రవాణాశాఖ అధికారులు, వాహనదారులకు దళారులుగా వ్యవహరిస్తున్న ఆర్టీఓ ఏజెంట్లు... వాహనదారుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. మిగిలిన మొత్తాన్ని అధికారులకు సమర్పిస్తున్నారు.
నిఘా పెట్టిన అనిశా....
ఈ వ్యవహారంపై 2 రోజులపాటు నిఘాపెట్టిన అనిశా... కడప ఉపరవాణాశాఖ కార్యాలయంపై దాడులు చేసింది. 15 మంది ఆర్టీవో ఏజెంట్లను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతోంది. వాహనదారుల నుంచి వసూలు చేసి.... రవాణాశాఖ అధికారులకు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్న 90 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
పత్రాలు లేకపోతేనేం...డబ్బులుంటే చాలు....
జిల్లావ్యాప్తంగా కడప, ప్రొద్దుటూరు, బద్వేలు, రాజంపేట, రాయచోటి, పులివెందులలో... రవాణశాఖ కార్యాలయాలు ఉన్నాయి. సాధారణంగాఎల్.ఎల్.ఆర్ డ్రైవింగ్ లైసెన్స్, వాహన సామర్థ్య పరీక్షలకు.. వాహనదారులు నేరుగా కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. అయితే వేగంగా పని కావాలన్నా... వాహనాలతో పాటు కొన్ని ధ్రువపత్రాలు లేకపోయినా... ఆర్టీఓ ఏజెంట్ల సాయంతో వ్యవహారం సులువుగా సాగుతోందని ఏసీబీ వివరించింది.
జిల్లాలోని 5 రవాణశాఖ కార్యాలయాల్లోనూ ఇదే రీతిలోఆర్టీఓ ఏజెంట్ల వ్యవహారం నడుస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని కార్యాలయాల్లోనూ దృష్టిసారించే వీలుందని అనిశా వర్గాలు తెలిపాయి.
ఇవీ చూడండి-కడప రవాణా కార్యాలయంపై అనిశా దాడులు