Venkat Reddy Get Bail and Released From Jail : వైఎస్సార్సీపీ ప్రభుత్వం గత ఐదేళ్లూ చేసిన ఇసుక, ఖనిజ, గనుల దోపిడీలో కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న గనుల శాఖ పూర్వపు డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డికి బెయిలు వచ్చేసింది. 50 రోజులకు పైగా రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు బెయిలు మంజూరు చేస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి హిమబిందు ఉత్తర్వులిచ్చారు. దీంతో రాత్రి ఆయన విజయవాడలోని జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు.
గనుల శాఖ పూర్వపు డైరెక్టర్ వెంకటరెడ్డి బెయిల్‌పై బయటకొచ్చేశారు. జగన్ ప్రభుత్వంలో గనుల శాఖకు సంబంధించిన టెండర్లు, ఒప్పందాలు, ఏపీఎంఎంసీ నిబంధనలు, ఆపరేషన్స్, ఇసుక తవ్వకాల్లో భారీ ఎత్తున అక్రమాలు, అవినీతి, అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలతో వెంకటరెడ్డిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. సెప్టెంబరు 26న హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. 27న ఏసీబీ కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండు విధించారు. ఆ తర్వాత రిమాండు పొడిగించారు. అయితే ఇసుక కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన 50 రోజుల్లోనే ఆయన జైలు నుంచి బయటకొచ్చారు.
అవినీతి నిరోధక చట్టం, మైన్స్ అండ్ మినరల్స్ చట్టంలోని సెక్షన్లతో పాటు ఐపీసీలోని నేరపూరిత విశ్వాస ఘాతుకం, నేరపూరిత కుట్ర తదితర సెక్షన్ల కింద వెంకటరెడ్డిపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. జగన్ ఏలుబడిలో ఇసుక విధానం ముసుగులో 2 వేల566 కోట్ల మేర దోపిడీ జరిగినట్లు తేల్చారు. ఈ కుంభకోణానికి వెంకటరెడ్డి అన్ని విధాలుగా సహకరించారని గుర్తించారు. ఇసుక కాంట్రాక్ట్ సంస్థలైన జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ , జీసీకేసీ, ప్రతిమ సంస్థలు సహా మరికొందరితో కలిసి వేల కోట్లు కొల్లగొట్టేందుకు ఆయన నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని నిర్ధారించారు.
వెంకటరెడ్డిని రెండు విడతలుగా కస్టడీకి తీసుకుని ఏసీబీ విచారించింది. ఈ కుంభకోణం వెనక ఉన్న అంతిమ లబ్ధిదారు వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించింది. 2 వేల 600 కోట్ల దోపిడీకి మూలం ఎక్కడుంది? సూత్రధారులెవరు? ఎవరి ఆదేశాల మేరకు ఈ అక్రమాలకు పాల్పడ్డారనేదానిపై ప్రశ్నలు సంధించింది. అయితే వెంకటరెడ్డి విచారణకు ఏ మాత్రం సహకరించలేదు. తనకేమీ తెలియదని, గుర్తులేదని సమాధానమిచ్చారు. ఏ కీలక ప్రశ్నకూ సమాధానమివ్వలేదు. ఆయన నుంచి ముఖ్యమైన సమాచారం రాలేదు. కానీ ఇంతలోనే ఆయన బెయిల్‌పై బయటకొచ్చేయడం చర్చనీయాంశంగా మారింది.
వెంకటరెడ్డి చర్యలతో రూ.2,566 కోట్ల నష్టం - రిమాండ్ రిపోర్టుని న్యాయస్థానానికి సమర్పించిన ఏసీబీ