Temperatures Raising in Andhra Pradesh : వేసవి కాలం ప్రారంభం కాకముందే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. గత ఐదు రోజుల్లో సరాసరి 35 డిగ్రీలకుపైగా గరిష్ఠ ఉష్ణోగ్రత, 18 డిగ్రీలకుపైగా కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సగటున 35 డిగ్రీల పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒంగోలు, బాపట్లలో 35.9 డిగ్రీలు నమోదు కాగా నెల్లూరు, విజయవాడ లో 35.8 డిగ్రీలు నమోదయ్యింది.
కర్నూలు, కడప, చిత్తూరు, నరసరావుపేటలో 35.7, అనకాపల్లి, ఏలూరు లో 35.6, అనంతపురం, మంగళగిరి, గుంటూరు, తాడేపల్లిగూడెం, నంద్యాల లో 35.5, విజయనగరం, మచిలీపట్నం, రాజమహేంద్రవరం 35.4, శ్రీకాకుళం 35.3, తిరుపతి 35.1, కాకినాడ -35, విశాఖ లో 34.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఏటా మార్చి-ఏప్రిల్‌లో మంట పుట్టించే ఎండలు ఈసారి ముందే చుక్కలు చూపిస్తున్నాయి. ఫిబ్రవరి మొదటి వారం దాటకముందే, శివరాత్రికి శివ శివ అంటూ చలి సెలవు తీసుకోక ముందే సూర్యుడు చెలరేగి పోతున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. అసాధారణ వేడి ఉక్కపోతే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భూతాపం కారణంగా ఇప్పటికే గడిచిన 2024 చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించింది. మరి 2025 ఏం చేయబోతోందీ అన్న ఆందోళనలు మొదలయ్యాయి. ఈ సారి ఎండలు భారీగానే ఉండే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనాలు వేస్తున్నారు.
ఉక్కపోతలు మొదలు - మరో వేడి సంవత్సరమేనా!
గత శతాబ్ద కాలంలో 2024 అత్యంత వేడి సంవత్సరంగా నమోదైంది. 2025 కూడా అదే మాదిరిగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
- 2023లో ఆరు నెలలు, 2024లో ఏడాది పొడవునా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
- 1901 నుంచి సేకరిస్తున్న సమాచారం ప్రకారం 2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించింది. ఉష్ణోగ్రత సగటున 0.65 డిగ్రీలు పెరిగింది.
- గతేడాది జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యలో సాధారణం కంటే 0.37 డిగ్రీలు పెరిగింది.
- ఈ ఏడాది జనవరిలో ఉష్ణోగ్రత సగటున 0.94 డిగ్రీలు పెరిగింది. 1958లో 1.17, 1990లో 0.97 డిగ్రీలు పెరిగాయి. ఆ తర్వాత ఇదే అధికం.
మొదలైన భానుడి భగభగలు - ఫిబ్రవరిలోనే 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు