తెదేపా నేతలపై సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పెయిడ్ ఆర్టిస్టులతో రాజకీయాలు చేసే దుర్మార్గపు ఆలోచనలు చంద్రబాబు నాయుడు చేస్తున్నారని ఆరోపించారు. చలో ఆత్మకూరు బయల్దేరిన ఆయనను గుంటూరులో పోలీసులు నిర్బంధించారు. ఈ సందర్భంగా ఆయన నివాసంలో మాట్లాడారు. ఈ రోజు తెదేపా నేతలు చేసే కుట్ర రాజకీయాలకు స్వస్తి పలికేందుకు చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చామని తెలిపారు. చంద్రబాబు కపట రాజకీయాలు ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. అందుకే గత ఎన్నికల్లో 23 సీట్లు వచ్చాయని...రాబోయే రోజుల్లో 3 సీట్లకు పడిపోతారని జోస్యం చెప్పారు. చంద్రబాబు ఇకనైనా మంచి మార్గంలో నడవాలని హితవు పలికారు.
పల్నాడును రక్షించుకుంటాం...
గత ప్రభుత్వంలో కోడెల శివప్రసాద రావు శాసనసభ ఫర్నీచర్ ఎత్తుకెళ్లిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఇలాంటి నీచమైన, ఘోరమైన పనులు చేసి పక్కదోవ పట్టించడానికే నాటకాలాడుతున్నాారని దుయ్యబట్టారు. పల్నాడును రక్షించుకోవాల్సిన బాధ్యత వైకాపా ఉందని తెలిపారు. అత్మకూరుకు వెళ్తాం...అక్కడి ప్రజలకు వాస్తవాలు చెబుతామని స్పష్టం చేశారు. చంద్రబాబు నిజస్వరూపాన్ని ప్రజల్లో ఎండగడతామని అన్నారు.